Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఓ నూతన సంక్షేమ పథకానికి పచ్చజెండా ఊపింది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచకపోయినా.. ప్రజల ఆకాంక్షల మేరకు వైసీపీ సర్కార్ ఈ పథకాన్ని తీసుకొస్తోంది. ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) నేస్తం పేరుతో అమలు చేయబోయో ఈ పథకం ద్వారా అగ్రవర్ణ పేదలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కాపుల్లోని 45–60 ఏళ్ల మహిళలకు అమలు చేస్తున్న వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం పథకాల మాదిరిగా.. అగ్రవర్ణ పేదల్లోని అదే వయస్సు ఉన్న పేద మహిళలకు కూడా 15 వేల చొప్పున మూడేళ్లు 45 వేల రూపాయలు ఈబీసీ నేస్తం ద్వారా అందించబోతున్నారు.
ఇది పాత విషయమే అయినా.. ఈ పథకం ద్వారా ప్రజలకు లబ్ధిచేకూరడమే కాకుండా.. ఆయా కులాల్లోని రాజకీయ నేతలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కూడా దక్కే అవకాశం ఉంది. వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం వంటి ఇతర నగదు బదిలీ పథకాలను ప్రభుత్వం ఆయా కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీ స్థాయిలో కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. బీసీలలోని ఉప కులాలు, ఎస్సీలలోని ఉప కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన పాలక మండళ్లను నియమించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా బ్రహ్మాణ, వైశ్య, కాపు కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 61 కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో మనుగడలో ఉన్నాయి. తాజాగా ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఆయా కులాల్లోని లబ్ధిదారులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతారనే అంచనాలున్నాయి.
కార్పొరేషన్ల ద్వారానే ఈబీసీ నేస్తం పథకం అమలు జరిగితే.. నూతనంగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా నూతన కార్పొరేషన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈబీసీ కార్పొరేషన్ లేదా అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమలకు వేర్వేరుగా కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అగ్రవర్ణాల్లోని పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తమకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెట్టాలనే డిమాండ్లు, విజ్ఞప్తులు ఆయా వర్గాల ప్రజల నుంచి వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగానే వైసీపీ సర్కార్ ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చింది. పథకం అమలు చేసే ముదు లేదా తర్వాతైనా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే.. ఆయా వర్గాల్లోని నేతలకు రాజకీయంగా అవకాశాలు లభిస్తాయి. ఒక్కొక్క కార్పొరేషన్‌కు ప్రభుత్వం చైర్మన్ సహా గరీష్టంగా 12 మంది డైరెక్టర్లను నియమించింది.