iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణకు ముహూర్తం సమీపిస్తున్నట్టు కనిపిస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో కీలక నిర్ణయాలుంటాయనే ప్రచారం ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో అమరావతికి సంబంధించి తుది నిర్ణయం తీసుకునే దిశలో సాగుతోంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనాలను ఏంచేయాలనే దానిపై చర్చ మొదలయ్యింది సీఎస్ నేతృత్వంలోని ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపింది. ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం రాబోయే క్యాబినెట్ లో వాటిపై చర్చించే అవకాశం ఉంది.
అమరావతికి రాజధానిగా 2015లో శంకుస్థాపన చేసిన తర్వాత 2019 వరకూ పనులు సాగించినా ఒక్క శాశ్వత భవనం కూడా పూర్తి చేయలేకపోయారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతో కేవలం తాత్కాలిక సెక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలతో పాటుగా తాత్కాలిక హైకోర్టు భవనం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వాటిలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగుతున్నాయి. నిర్మాణ లోపాలతో ప్రారంభంలో అసెంబ్లీలో వర్షంపు నీరు రావడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత హైకోర్టు భవనం నిర్మాణంలో కూడా భారీ వర్షాలకు సమీపప్రాంతాలన్నీ జలమయమయ్యే పరిస్థితి కొనసాగుతోంది.
వాటితో పాటుగా ఎమ్మెల్యే క్వార్టర్స్, సివిల్స్ అధికారుల భవనాలు, ఎన్జీవోలు, మంత్రులు, జడ్జిల నివాసాల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది. అయితే వాటిలో ఎమ్మెల్యే క్వార్టర్స్, సివిల్స్ అధికారుల నివాస గృహాలు మాత్రమే 75 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన వాటిలో ఎన్జీవోలకు సంబంధించి 60 శాతం మాత్రమే పూర్తికాగా, మంత్రులు, జడ్జీల నివాసాలయితే ఇంకా పునాదుల దశలో 25 శాతంలోపు మాత్రమే పనులు జరిగాయి. దాంతో ఈ విషయంలో అమరావతిని శాసన రాజధానిగా మారిస్తే ఆయా భవనాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే సుమారు రెండేళ్లుగా పనులు పడకేశాయి. దాంతో వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి, ఎలాంటి అవసరాలకు వినియోగించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
అందులో భాగంగా రాజధాని భవనాల నిర్మాణంపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ భేటీ జరిగింది. శాసన రాజధానికి సంబంధించి అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చించారు. సీఎస్ తో పాటుగీ సీఆర్డీయే కమిషనర్, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా భవనాల నిర్మాణాల పేరుతో 10వేల కోట్లు వెచ్చించింది. కానీ ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం 75శాతం పనులు పూర్తయిన వాటిని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు చెబుతున్నారు. అధికారుల భేటీలో కూడా అదే ప్రతిపాదన రావడంతో దానికి అనుగుణంగా నిధుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న భవనాల నిర్మాణానికి మరో రూ. 2,154 కోట్లు అవసరమని అంచనా వేశారు. అంతేగాకుండా ఇప్పటికే పనులు చేసిన ప్రస్తుత కాంట్రాక్టర్ల బకాయిల చెల్లింపుల కోసం 300 కోట్లు అవసరమని అవసరమని కమిటీ చెబుతోంది. దాంతో ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకుంటే అమరావతి నిర్మాణాల వ్యవహారం కొలిక్కి రావచ్చు. ఇక వచ్చే జూన్ నాటికి ఇలాటి అపరిష్కృత అంశాలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందడుగు వేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.