Idream media
Idream media
వ్యవసాయం, పాడి రంగాల్లోని రైతులకు అన్ని సేవలు, ఉత్పత్తులు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఇకపై నాణ్యమైన సేవలు నిరంతరం అందనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీకేల్లోని లోపాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని అధిగమించే చర్యలు చేపట్టింది.
2020 ఖరీఫ్ (జూన్) నుంచి ఏపీలోని గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర ఉత్పాదక వస్తువులు, పంట నమోదు, పాడి పశువుల వైద్యం, దాణా విక్రయించేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎరువులు, పురుగు ముందులు తదితర వస్తువులను రైతులు బుక్ చేసుకున్న మూడునాలుగు రోజుల తర్వాత సరఫరా జరుగుతుండడంతో ఈ విధానం విఫలమైంది. వ్యాపారుల వద్ద కన్నా ఇక్కడ యూరియా, డీఏపీ బస్తాపై 70 – 100 రూపాయలు తక్కువగా రావడంతోపాటు రవాణా ఖర్చులు కూడా రైతులకు కలిసి వచ్చినా.. అవసరమైన సమయంలో సరుకు అందించకపోవడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది.
ఏపీ మార్క్‌ఫెడ్‌కు బాధ్యతలు..
ఆర్‌బీకేల్లోని లోపాలను గుర్తించిన ప్రభుత్వం.. ఇకపై అలాంటి సమస్యలేకుండా.. ఆర్‌బీకేల్లోనే ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ పరిధిలోని ఏపీ మార్కెట్ ఫెడ్‌కు ఆర్‌బీకేలకు ఉద్పాతక వస్తువల సరఫరా, నిల్వ, పర్యవేక్షణ బాధ్యలు అప్పగించింది. ఇందు కోసం ప్రతి జిల్లాకు అదనంగా ఒక మేనేజర్‌ను నియమించింది. ఇకపై ఏపీ మార్క్‌ఫెడ్‌కు జిల్లాకు ఇద్దరు మేనేజర్లు ఉండబోతున్నారు. ఒకరు పంట కొనుగోళ్లను పర్యవేక్షించనుండగా.. మరొకరు ఆర్‌బీకేల్లో వస్తువులు, సేవలను పర్యవేక్షించబోతున్నారు.
వ్యవసాయ డివిజన్ నుంచి ఆర్‌బీకేలకు..
ప్రతి వ్యవసాయ డివిజన్‌లో ఎరువులు, పురుగుమందులు తదితర ఉత్పాదక వస్తువులను నిల్వ చేసి.. ఆర్‌బీకేల్లోని వ్యవసాయ సహాయకుడి వినతి మేరకు అవసరమైన సరుకును అక్కడకు సరఫరా చేయనున్నారు. ఆర్‌బీకే పరిధిలోని గోదాముల్లో నిల్వ చేసే సరుకును రైతులు అక్కడిక్కడే ఎంచుకుని తీసుకునేలా నూతన విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆర్‌బీకేల్లోని కియోస్క్‌లలో రైతుల పేర్లు, భూముల సర్వే నంబర్లు నమోదు చేసిన తర్వాత వారికి అవసరమైన ఎరువులు, పురుగుమందులను అందించనున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి రైతులకు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన సేవలు పూర్తి స్థాయిలో అందబోతున్నాయి.
ఎమ్మార్పీ కన్నా తక్కువగా..
ఈ ఏడాది అరకొరగానైనా కంపెనీ ధరలకే ఆర్‌బీకేల్లో ఎరువులు, పురుగుమందులను విక్రయించారు. పట్టణాల్లోని వ్యాపారుల కన్నా ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఆర్‌బీకేలలో ఎరువులను కొనుగోలు చేసిన రైతులకు అక్కడ ధరలకు, వ్యాపారి వద్ద ధరలకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసింది. 50 కేజీల బస్తా యూరియా ధరపై కనీసం 70 రూపాయల వ్యత్యాసం ఉంది. దీనికి మళ్లీ రవాణా ఖర్చులు అదనం. ఖరీఫ్ నుంచి విక్రయించబోయే ఎరువులు, పురుగుమందులపై ఎమ్మార్పీ కన్నా 10 – 25 రూపాయలు తక్కువగానే ఆర్‌బీకేల్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆర్‌బీకేలకు శాశ్వత భనాలు..
ప్రతి ఆర్‌బీకేకు శాశ్వత భవనం నిర్మించే పనులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ నెల నాటికి 10,641 ఆర్‌బీకేలకు నూతన భవనాలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ప్రతి భవనాన్ని 19 లక్షల రూపాయలతో నిర్మిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భవనాలు పూర్తి కాగా. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితోపాటు గోడౌన్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఆర్‌బీకేలు, గోడౌన్లలో ఎరువులు, పురుగు మందులు తదితర ఉత్పాదక వస్తువులను నిల్వ చేయబోతున్నారు. అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు ఆర్‌బీకేల్లోనే నిల్వ చేయడం వల్ల రైతులు తమకు అవసరమైన వాటిని వెంటనే తీసుకునే అవకాశం లభిస్తుంది. దీన్ని వల్ల రైతులకు విలువైన సమయం, నగదు ఆదా అవుతుంది.