Idream media
Idream media
విద్య, వైద్యానికి అధిక ప్రాధానత్య ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురుకుల పాఠశాల్లోని 9 నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా కారణంగా వారి చదువులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన తరగతులైన 9, 10, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇందుకు అవసరమైన ప్రణాళికలు అధికారులతో సిద్ధం చేయిస్తున్నారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో 9 నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులు 60 వేల మంది ఉన్నారు. వీరిలో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు ఫోన్లు సమకూర్చుకోగలిగే శక్తి ఉన్నవారు. అయితే మిగతా 70 శాతం మందికి ఆ స్తోమత లేదు. ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండేందుకు, వారి చదువులు చక్కగా సాగేందుకు ప్రతి ఒక్కరికీ 5 నుంచి 6 వేలు విలువైన స్మార్ట్ ఫోన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం వైఎస్ జగన్.. విద్యతోనే పేదరికం నుంచి బయటపడగలమని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థుల కోసం చేసే పనుల్లో ఎక్కడా ఆలోచించడంలేదు. విద్యార్థుల ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. అంగన్‌వాడీలను ప్రీ స్కూల్‌గా మారుస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకూ అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాల ద్వారా ఉచితంగా, నాణ్యమైన విద్యను ఆంగ్ల మాద్యమంలో అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.