iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డ కేసు.. హైకోర్టులో స్టే పిటిషన్‌ ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

నిమ్మగడ్డ కేసు.. హైకోర్టులో స్టే పిటిషన్‌ ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో తీర్పు అమలు చేయడంపై దాఖలు చేసిన స్టే పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు తీర్పుపై సుప్రిం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో వైసీపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. తీర్పు అమలుపై వేసిన స్టే పిటిషన్‌తోపాటు.. ఎస్‌ఈసీ కనగరాజ్‌ తరఫున వేసిన పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకుంది. తనను కావాలనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా తొలగించారని, ఇది రాజ్యాంగబద్ధమంటూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

గత నెల 29వ తేదీ హైకోర్టు నిమ్మగడ్డ పిటిషన్‌పై తీర్పు ఇచ్చింది. అయితే ఈ అంశంలో సాంకేతిక అంశాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రిం కోర్టులో దాఖలు చేసింది. ఎన్నికల సంస్కరణలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీ పదవిని మూడేళ్లకు కుదించింది. అంతేకాకుండా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని ఎన్నికల కమిషనర్‌గా నియమించాలనుకుంది. ఎన్నికల్లో ధన, వస్తు పంపకాలు, ప్రలోభాలు నివారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకురాగా గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇప్పటికే నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవి కోల్పోయారు.

నూతన ఎస్‌ఈసీగా రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టు రిటైర్ట్‌ జడ్జి వి.కనగరాజ్‌ను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే కోర్టు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్, జీవోలును కొట్టి వేస్తూ.. మంత్రివర్గం సూచన మేరకు ఎస్‌ఈసీని నియమించే అధికారం గవర్నర్‌కు లేదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కూడా గత చంద్రబాబు మంత్రివర్గ సూచన మేరకు అప్పటి గవర్నర్‌ నియమించారు కాబట్టి అది కూడా చెల్లదనే సాంకేతిక కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలు రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ మీడియా ముఖంగా వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం తలుపుతట్టింది. ఈ రోజు లేదా రేపు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ సుప్రింలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.