స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ లలిత్ ధర్మాసనం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ చర్చకు వచ్చింది. ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన జస్టిస్ లలిత్ బెంచ్, ఈ పిటిషన్ ని రేపటి లిస్ట్ లో చేర్చాలని సుప్రీం కోర్ట్ రిజిస్టార్ ని ఆదేశించినట్టుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషనర్ గా మారింది. ఒకవైపు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఈసీ రద్దు చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర సీ.ఎస్ నీలం సహానీ ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. మరోవైపు ఈ ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యి గవర్నర్ కి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది.
సాధారణంగా రాజ్యాంగం ప్రకారం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ విధుల్లో కోర్టు లు జోక్యం చేసుకోవు. అయితే తాజా అంశంలో తమను ఏమాత్రం సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపు తట్టింది. అయితే సుప్రీంకోర్టు ఈ అంశంపై ఎటువంటి ఆదేశాలిస్తుంది అనే అంశంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టాలని భావిస్తుందా ?.. ఎన్నికల కమిషన్ కు ఏదైనా ఆదేశాలిస్తుందా ?.. లేదా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో జోక్యం చేసుకోబోమని చెబుతుందా ?.. అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.