Idream media
Idream media
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఏపి సర్కార్ ఆశ్రయించింది. దీనిపై రేపో, ఎల్లుండో విచారణ జరగనుంది. సోమవారం ఏపి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఏపి సర్కార్ చేర్చింది. ఏపి ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మహఫౌజ్ అహ్సాన్ నాజీ పిటిషన్ దాఖలు చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా 2016 జనవరి 30న నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. అయితే నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని చెప్పింది. అయితే దీని తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను తప్పిస్తూ ఏప్రిల్ 10న జీవో 618ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మే 29న తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశింది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ నేత మస్తాన్ వలి సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేశారు.