Idream media
Idream media
కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీళ్లను పూర్తిస్థాయిలో వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పింది. సోమవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్‌తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్దేశాలను నిర్మొమహాటంగా తేల్చి చెప్పారు.
శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సామర్థ్యం మేరకు కాలువకు నీరు చేరుతుందని, అయితే ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో పది రోజులు కూడా ఉండదని వివరించారు. 854 అడుగుల్లో నీరు ఉంటే పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు చేరతాయని, అంతకంటే నీటి మట్టం తగ్గితే కాలువకు నీరు చేరదని తెలిపారు. దీనివల్ల న్యాయబద్ధంగా రావాల్సిన నీళ్లను కూడా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందని, తద్వారా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశంకు నీటిని తరలించే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. అందుకే జల వివాదాల పరిష్కార మండలి కేటాయించిన మేరకు నీటిని వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టామని తెలిపారు.
2016లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికే పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టామని తెలంగాణ చెప్పింది. అదే తరహాలోనే రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టామని తేల్చి చెప్పారు.
800 అడుగుల నుంచే తెలంగాణ తోడేస్తోంది.
మరోవైపు శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలించడానికి పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుందని ఏపీ అధికారులు తెలిపారు. అలాగే 796 అడుగుల నుంచి ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 42 వేల క్యూసెక్కులను తరలించగలదని చెప్పారు. దీని వల్ల శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోందని వివరించారు. అలాగే విభజన చట్టంలోని నిబంధనలను పాటించకుండా, కృష్ణా బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించడానికి 2015న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టిందని గుర్తు చేశారు.
అలాగే రోజుకు రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించడానికి జూన్ 11, 2015న డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని తెలిపారు. వీటితోపాటు భక్త రామదాస, తుమ్మిళ్ల ఎత్తిపోతలను కూడా చేపట్టిందని వివరించారు. వాటర్ గ్రిడ్ ద్వారా కూడా కృష్ణా జలాలను తరలిస్తోందని చెప్పారు. మొత్తంగా ఈ 5 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం దాదాపు 150 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తోందని ఆధారాలతో సహా కృష్ణా బోర్డుకు వివరించారు. వీటితోపాటు అనుమతులు లేకుండా కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దాదాపు 28 టీఎంసీలను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.
తెలంగాణ చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వల్ల దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికి చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము చేపట్టే రాయలసీమ పథకం ద్వారా అదనంగా ఒక్క చుక్క నీరు కూడా తీసుకోమని స్పష్టం చేశారు.