iDreamPost
android-app
ios-app

అంతుచిక్కని ప్రజా తీర్పు – ప్రజాస్వామ్యానికి పట్టు

అంతుచిక్కని ప్రజా తీర్పు – ప్రజాస్వామ్యానికి పట్టు

రాజకీయ ప్రజా చైతన్యం ప్రజా స్వామ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజా స్వామ్య విధానాన్ని అవలంభిస్తున్న భారత్‌కు ప్రజా చైతన్యం చాలా అవసరం. పాలకులు నిరంకుశవాదులుగా మారకుండా ప్రజా చైతన్యమే వారిని కట్టడి చేస్తుంది. నేతలు తాము చేప్పిందే వేదం.. చేసేదే చట్టం అన్నట్లుగా ప్రవర్తించకుండా వజ్రాయుధం అనే ఓటుతో వారి ఆలోచనలను ఖండిస్తారు.
2019లో దేశంలో అదే జరిగింది. 2014 నుంచి అప్రతిహాతంగా సాగుతున్న బీజేపీ ప్రయాణాన్ని పరిశీలిస్తే శిఖరాన్ని తాకి నేలకు పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వ్యవహారించకుండా 2019 ద్వితియార్ధంలో దేశ ప్రజలు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

2019 ప్రధమార్థంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు కన్నా బీజేపీకి మరింత బలాన్ని (303 సీట్లు) ఇచ్చిన దేశ ప్రజలు, ఆ అధికారాన్ని వారు దుర్వినియోగం చేయకుండా ఉండేలా ద్వితియార్థంలో కల్లెం వేశారని ఇటీవల జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి సంతృప్తినిచ్చే ఫలితాలు మాత్రం రాలేదు. జార్ఖండ్‌లో అధికారం కోల్పోగా, మహారాష్ట్రను పట్టింపుతో పొగొట్టుకుంది. ఇక హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆయా రాష్ట్రాలలో లోక్‌ సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ శాసన సభ ఎన్నికలకు వచ్చే సరికి చతికిల పడింది.


జార్ఖండ్‌లో పరాభం..

లోక్‌ సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఉన్న 14 సీట్లకు గాను 11 సీట్లలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అప్పటి మిత్రపక్షమైన ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ కు ఒక స్థానం దక్కింది. వెరసి అప్పటి బీజేపీ కూటమి 14 సీట్లకు గాను 12 సీట్లు గెలుచుకున్నట్లైంది. అయితే కేవలం ఆరు నెలల్లోనే పరిస్థితి తారుమారైంది. 11 సీట్లు గెలిచిన ధైర్యంతోనో ఏమో కానీ తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగిన బీజేపీకి రాష్ట్ర ప్రజలు కేవలం 25 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.


మహారాష్ట్రలోనూ శృంగభంగం..

మహారాష్ట్ర శాసన సభలోనూ బీజేపీకీ ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్న 42 స్థానాలకు గాను 23 చోట్ల బీజేపీ గెలిచింది. మిత్రపక్షం శివసేన 18 చోట్ల విజయదుందుభి మోగించింది. వెరసి బీజేపీ బలం 41 సీట్లకు పెరిగింది. అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శివసేనతో కలసి పోటీ చేసింది. 288 సీట్లకు గాను బీజేపీ 105 సీట్లు మాత్రమే గెలిచింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 145కు 30 సీట్ల దూరంలో ఆగింది. మిత్రపక్షం శివసేన 56 సీట్లలో గెలిచినా.. సీఎం పీఠం పంపకంలో పట్టువదలకపోవడంతో.. ఏకంగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రత్యర్థులు కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

హర్యానాలో ఊరట…

లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ఉన్న 10 సీట్లను గెలిచి బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే తర్వాత నెలల వ్యవధిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు ప్రజలు బీజేపీకి ఇవ్వలేదు. 90 స్థానాలకు గల హర్యానాలో బీజేపీ కేవలం 40 సీట్లు మాత్రమే గెలిచింది. అధికారానికి మరో 6 సీట్ల దూరంలోనే ఆగిపోయింది. లోక్‌సభలో ఒక్క సీటు కాంగ్రెస్‌కు ఇవ్వని హర్యానా ప్రజలు అంసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 31 స్థానాల్లో గెలిపించారు. దుష్యంత్‌వాలా నేతృత్వంలోని జేజేపీ 10 సీట్లు గెలవడంతో దుష్యంత్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.