నాని నటించిన “అంటే సుందరానికి” సినిమాపై అందరూ చెప్తున్న ప్రధాన కంప్లైంట్ ఒక్కటే.. అదే సినిమా రన్ టైమ్. సినిమాను సాగదీశారు అంటూ దాదాపు పదిమంది ప్రేక్షకుల్లో 7-8 మంది ప్రేక్షకులు చెప్తున్నారు. దీనిపై దర్శకుడు వివేక్ ఆత్రేయ తాజాగా స్పందించారు.
సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ వేదికగా వివేక్ ఈ అంశంపై మాట్లాడారు. రన్ టైమ్ ను తగ్గించే ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత నిడివిలోనే చెప్పాలని బృందమంతా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
సెకండ్ హాఫ్ బాగుంది కానీ, ఫస్టాఫ్ సాగదీత అంటున్నారని, సెకండాఫ్ ను ఫాస్ట్ గా తీసిన తనకు, ఫస్ట్ హాఫ్ ను అలా తీయడం తెలియక కాదని పేర్కొన్నారు. అసలు ద్వితీయార్థంలో వచ్చే ప్రతి చిన్న మూమెంట్ కు కారణం ప్రథమార్థంలో ఉన్న సన్నివేశాలే అని చెప్పారు. అందుకే తమకు సినిమా నిడివిని తగ్గించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.
సందర్-లీల పాత్రల గ్రోత్ ను చూపెట్టాం.. అందుకోసం ఆ మాత్రం టైమ్ తీసుకోవడంలో తప్పులేదని అంటున్నారు. మొత్తానికి, ఈ సినిమాను ఇలాగే చూడాలి, ఇలానే ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు చిత్ర బృందం. మరి ఈ అంశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో ఇంకో వారంలో తెలిసిపోతుంది.