iDreamPost
android-app
ios-app

కొంతకాలం కరోనాతో కలసి జీవించాల్సిందేనన్న శక్తివంతమైన మహిళా నేత

కొంతకాలం కరోనాతో కలసి జీవించాల్సిందేనన్న శక్తివంతమైన మహిళా నేత

వైరస్ కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ ఒకవైపు.. ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని పాలకులు కరోనా పై వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. భవిష్యత్ ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆ దేశ ప్రజలను హెచ్చరించారు. ఇంకా కొన్నాళ్ళపాటు కరోనా వైరస్ తో మనం పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు. వినడానికి కష్టంగా ఉన్నా కొంతకాలం మనం వైరస్ తో కలిసి జీవించాలి అని స్పష్టం చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలి అని సూచించారు.

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఆ దేశంలో ప్రభావం చూపిన తర్వాత వెంటనే యూరప్ కు వెళ్ళింది. ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలు వైరస్ బారిన పడ్డాయి. ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా అందులో మూడొంతులు అమెరికాలో నమోదవగా మరో వంతు భాగం యూరప్ లో నమోదయ్యాయి. యూరప్ దేశాలలో లక్షల్లో కరోనా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జర్మనీలో ఇప్పటివరకు 1.5 లక్షల పైగా కేసులు నమోదవగా ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తున్న కూడా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వైరస్ దేశంలో ప్రారంభ దశలోనే ఉందని చెప్పడం గమనార్హం. అంటే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూ వారిని నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. మరి కొంతకాలం వైరస్ తో కలిసి జీవించాల్సిన చెప్పిన మోర్కెల్ .. ప్రజలను ఆ మేరకు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై నిరుద్యోగిత, పేదరికం భారీగా పెరిగిపోయే ప్రమాదముంది. ఈ క్రమంలో తమ ప్రజలను రక్షించుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన పరిస్థితి ఉందని ఏంజెలా మెర్కెల్ చెప్పకనే చెబుతున్నారు. అయితే కరోనా ను ఎదుర్కొనేందుకు భౌతిక దూరం, స్వీయ రక్షణ పాటిస్తూనే రాబోయే రోజుల్లో పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు.