iDreamPost
android-app
ios-app

విరాళాల లెక్క ఎవరు చెబుతారు..? – చంద్రబాబుపై ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం

విరాళాల లెక్క ఎవరు చెబుతారు..? – చంద్రబాబుపై ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ వైపు విరాళాలు సేకరిస్తుండగా.. ఈ విరాళాలు, గతంలో అమరావతి నిర్మాణం కోసం సేకరించిన విరాళాల లెక్కలు చెప్పాలని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సమయంలో ఆంధ్రజ్యోతి చంద్రబాబును టార్గెట్‌ చేసుకుని ప్రశ్నలు సంధించడం త్రీవ చర్చనీయాంశమవుతోంది. ఆంధ్రజ్యోతి సంధించిన ప్రశ్నలపై తెలుగుదేశం పార్టీలోనూ, మీడియా వర్గాల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది.

‘‘అమరావతికి దిక్కెది..? విరాళాలకు విలువేది..?’’ అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ రోజు పలు ప్రశ్నలు సంధించింది. పోరాటానికి సై అంటూ ఆడపడుచులు మరోసారి ఆభరణాలు ఇస్తున్నారు.. అయితే రాజధానికి మేము సైతం అంటూ నాడు దాతలిచ్చిన విరాళాలకు దిక్కెవరు..?, కేపిటల్‌ కట్టేందుకు ఆన్‌లైన్‌లో ఇటుకలు ఇచ్చిన వారికి సమాధానం చెప్పేదెవరు..?, అమరావతి విరాళాలకు లెక్క ఎవరు చెబుతారు..? అంటూ ఆంధ్రజ్యోతి ప్రశ్నల వర్షం కురిపించింది.

చంద్రబాబు తానా అంటే తందానా అని ఆంధ్రజ్యోతి పత్రిక, యాజమాన్యం అండగా నిలుస్తోందని వైస్సార్‌సీపీ శ్రేణులు, కొందరు మీడియా వర్గాలు విమర్శలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. వారి విమర్శలకు తగినట్లుగానే చంద్రబాబు ఏమి చేసినా రైటే అన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తుంటాయి. టీడీపీ నేతల విషయంలో ఎలా ఉన్నా చంద్రబాబు పై మాత్రం ఆంధ్రజ్యోతి పత్రిక ఈగ వాలనీయదన్న ప్రచారం ఉంది. ఆ పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ ప్రతి వారం ఆర్‌కే.. కొత్తపలుకు పేరుతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసే పనులను బలంగా సమర్థిస్తుంటారు.

ఇంతలా.. చంద్రబాబును సమర్థించే ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఒక్కసారిగా అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో చంద్రబాబు గతంలోనూ, ఇప్పుడు వసూలు చేస్తున్న విరాళాల లెక్కపై ప్రశ్నలు సంధించడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక్కసారిగా ఆంధ్రజ్యోతి స్టాండ్‌ ఎందుకు మారిందన్న అంశంపై టీడీపీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూ. ఏకంగా సోషల్‌ మీడియాలో తమ ప్రశ్నలు, భావోద్వేగాలు పంచుకోవాలని పాఠకులకు పిలుపునివ్వడం ఆ పార్టీకి, చంద్రబాబుకు అనుకొని తిప్పలు తెచ్చిపెట్టింది.

రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబు.. నిర్మాణం కోసమంటూ ఆన్‌లైన్‌లో ఇటుకలు విక్రయించారు. ఉద్యోగులు, వివిధ వర్గాల వారు విరాళాలు ఇచ్చారు. పాఠశాల్లో ప్రత్యేకంగా హుండీలు పెట్టి విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. సచివాలయంలో పెద్ద పెద్ద హుండీలు పెట్టారు. టీడీపీ సానుభూతి పరులైన మహిళలు తమ ఆభరణాలు విరాళంగా ఇచ్చారు. విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు విరాళాలు ఇచ్చారు.

ఇప్పుడు అదే అమరావతి కోసమంటూ రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ పేరుపై చంద్రబాబు విరాళాలు సేకరిస్తున్నారు. నగదు, మహిళల నుంచి ఆభరాణాలు ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఆ నాడు స్వతంత్రం కోసం గాంధీజీ చేపట్టిన ఉద్యమానికి మహిళలు తమ ఆభరణాలు ఇచ్చారని, ఇప్పుడు అమరావతి కోసం మహిళలు ఆభరాణాలు ఇస్తున్నారంటూ చంద్రబాబు ప్రచారం చేస్తూ ఆభరణాలు విరాళంగా తీసుకుంటున్నారు. ఈ తంతు తన భార్య నుంచే మొదలు పెట్టారు. తన ప్లాటినం గాజును విరాళంగా ఇస్తున్నట్లు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజధాని గ్రామంలో ప్రకటించి ఇచ్చారు. ఈ ఘటన తర్వాత మహిళల నుంచి ఉంగరాలు, నల్లపూసల గొలుసు, కాలి పట్టీలు.. ఇలా రకరకాల ఆభరణాలు విరాళాలుగా విరివిగా వస్తున్నాయి. తాజాగా నిన్న మంగళవారం కృష్ణా జిల్లా ముదినేపల్లికి చెందిన బాలిక 20 లక్షలు విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చింది.

అమరావతి నిర్మాణం, అమరావతి పరిరక్షణ.. ఇలా రెండు సార్లు చంద్రబాబే విరాళాలు సేకరించారు. ప్రజలు భావోద్వేగంతో కూడిన విరాళాలు ఇచ్చారని ఆంధ్రజ్యోతి చెబుతోంది. మరి చంద్రబాబు ఆంధ్రజ్యోతి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతారా..? సేకరించిన విరాళాలు ఎలా ఖర్చు పెట్టింది..? ఇంకా ఎంత ఉంది..? నగలు ఏమి చేసింది..? అన్న వివరాలను చంద్రబాబు ప్రజలకు చెబుతారా..? వేచి చూడాలి.