Idream media
Idream media
మాజీ సీఎం చంద్రబాబు– ఆంధ్రజ్యోతి పత్రికల మధ్య ఒక అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ‘‘చంద్రబాబు నవ్వితే రాష్ట్రమంతా సంతోషం ఉన్నట్లే.. చంద్రబాబు బాధ పడితే ప్రజలంతా కష్టాల్లో ఉన్నట్లే’’ ఇలా ఉంటుంది ఆ పత్రిక వ్యవహార శైలి. ఇందుకే ఆ మీడియాకు చంద్రబాబు ఎంతో ఆయాచిత లబ్ధి చేకూర్చారు. పలు జిల్లాల్లో తక్కువ ధరకే భూములు కట్టబెట్టారు. అసెంబ్లీ కవరేజీని ఏకపక్షంగా ఇచ్చేశారు. కోట్లు విలువ చేసే భూమిని లక్షలకు.. మరి కొన్ని చోట్ల వేల రూపాయలకే ధారాదత్తం చేశారు. అయితే విశాఖలో జరిగిన ఓ వ్యవహారం కాస్త ఇంట్రస్టుగా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇబ్బంది ఉండకూడదని భావించి.. 1986లో తమకు కేటాయించిన భూమి రోడ్డు విస్తరణలో పోయిందని, దానికి పరిహారం ఇప్పటికీ ఇవ్వలేదని, అందువల్ల ప్రత్యామ్నాయంగా ఇప్పుడు భూమి కావాలంటూ 2017లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరినట్లు తమ సంస్థలోని సీనియర్ జర్నలిస్టుల సహకారంతో ఒక చిన్న పిట్ట కథను అల్లేసింది ఆంధ్రజ్యోతి అలియాజ్ ఆమోదా పబ్లికేషన్స్.
దాన్ని చంద్రబాబు వెంటనే ఆమోదించేసి విశాఖలో కోట్లు విలువ చేసే అర ఎకరా భూమిని పది వేలకు, మరో అర ఎకరా భూమిని 50లక్షలకు ఇచ్చేశారు. కాలం ఒకే తీరున ఉండదు కదా..! రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఒక ప్రైవేటు సంస్థకు భూమిని అంత తక్కువకు ఇవ్వడమేంటి? అని రెవెన్యూ అధికారులు ఆరా తీశారు. విచారణకు ఆదేశించారు. తీరా చూస్తే అసలు 1986లో ఆంధ్రజ్యోతికి భూమి ఉన్నట్లు ఎలాంటి రికార్డులు లేవని తేలింది. అసలు లేని భూమి రోడ్డు విస్తరణలో ఎలా పోయిందంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఆమోదా పబ్లికేషన్స్ కోర్టుకు వెళ్లింది. అక్కడ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆ సంస్థకు 1986లో ఆ సంస్థకు భూమే ఇవ్వలేదని చెప్పారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. అసలు ఆ ఒరిజినల్ రికార్డులు ఉంటే తమ ముందుంచాలని ఆమోదాకు చెబుతూ విచారణ వాయిదా వేసింది.