iDreamPost
android-app
ios-app

జగన్‌కు మేలు చేస్తున్న ఆంధ్రజ్యోతి రాథాకృష్ణ..!

జగన్‌కు మేలు చేస్తున్న ఆంధ్రజ్యోతి రాథాకృష్ణ..!

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాయని, వైఎస్‌ రాజశేఖరెడ్డికి, ఇప్పుడు వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా పని చేస్తాయనే ప్రచారం ఉంది. అందుకే వాటిని ఎల్లో మీడియా అని కూడా పిలుస్తుంటారు. వైఎస్సార్, వైఎస్‌ జగన్‌లకు నష్టం కలిగించే రాతలు రాయడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలు పోటీ పడుతుంటాయి. ఒక్కొక్కసారి ఆంధ్రజ్యోతిదే పై చేయి అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వాటి ఖ్యాతిని తగ్గించేలా.. ఇవి పాతవే, ఇప్పటికే ఉన్నవే.. పేర్లు మార్చి కలరింగ్‌ ఇస్తున్నారు.. చంద్రబాబు ఎప్పుడో చేశారు.. వంటి పదాలతో కౌంటర్‌ కథనాలు రాస్తోంది.

చంద్రబాబుకు మేలు చేద్దామనే లక్ష్యంతో ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనాలు.. చివరికి వైఎస్‌ జగన్‌కు మేలు చేస్తున్నాయి. ఆయా కథనాలు రాసే విధానం పరిశీలిస్తే ఇట్టే అర్థం అవుతుంది. రాష్ట్రంలో సముద్రతీర జిల్లాల్లో 8 చోట్ల ఫిష్సింగ్‌ హార్బర్లు ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలలో ఫిష్సింగ్‌ హార్బర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని రెందు దశల్లో నిర్మించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు మొదటి దఫాలో తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలలో నాలుగు హార్బర్లకు శనివారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. మొత్తం 1,510 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణం పూర్తి చేయనున్నారు. డిసెంబర్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు పూర్తి చేస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

అయితే ఆంధ్రజ్యోతి ఈ ఎనిమిది చోట్ల ఫిష్సింగ్‌ హార్బర్లు నిర్మించాలని ఏళ్ల నాటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఆదివారం ఎడిషన్‌లో ఓ కథనం రాసింది. అంతా పాత కథే.. ఫిష్సింగ్‌ హార్బర్ల ప్రతిపాదనలు ఏళ్ల నాటివి.. టీడీపీ హాయంలో ఎనిమిది హార్బర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో పనులు జరగలేదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కొత్తగా అంచనాలు పెంచి కలరింగ్‌ ఇస్తోంది.. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులతో వీటిని నిర్మిస్తున్నారు.. అంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన పనిని తక్కువ చేసే ప్రయత్నం చేసింది.

ఇలా రాయడంతోనే ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్‌ జగన్‌కు ఎంతో మేలు చేస్తోంది. ఫిష్సింగ్‌ హార్బర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల నాటివే. కాదు అనేందుకు లేదు. ఎవరైనా ఈ విషయం ఒప్పుకోవాల్సిందే. ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న ఈ హార్బర్ల నిర్మాణాన్ని జగన్‌ ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. ఏడాదిలోనే నాలుగు హార్బర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఏడాది కాకపోతే మరో ఆరు నెలలు.. ఏమైతేనేం.. ప్రతిపాదనకే పరిమితమైన హార్బర్ల నిర్మాణం పూర్తి చేసి మత్య్సకారులు జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమనే మాటలు సీఎం జగన్‌ నుంచి వచ్చాయి. టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదనలు రూపాందించారని కూడా రాసిన ఆంధ్రజ్యోతి.. నాడు ఆ పనులు చేయలేదని, నేడు సీఎం జగన్‌ చేస్తున్నారని తన కథనంతో చెప్పకనే చెప్పింది. చంద్రబాబు ప్రతిపాదనలే రూపాందించారు.. కానీ జగన్‌ వాటిని అమలు చేస్తున్నట్లు స్పష్టంగా ఆంధ్రజ్యోతినే చెబుతోంది.

ఇక అంచనాలు పెంచి కలరింగ్‌ ఇస్తున్నారు, రివర్స్‌ టెండర్ల మాట ఎత్తడంలేదంటూ అవినీతి ముద్ర వేయాలనే ప్రయత్నం కూడా ఆంధ్రజ్యోతి చేసింది. ప్రతి ఏడాది స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) రేటు మారుతుంది. ఏదైనా అభివృద్ధి పథకానికి అంచనాలు రూపాందించి.. ఆ ఏడాదిలో పని పూర్తి చేయకపోతే.. మళ్లీ కొత్త ఏడాదిలో నూతనంగా అంచనాలు రూపాందించాల్సిందే. ఆ ఏడాది ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అంచనాలు రూపాందిస్తారు. ఖచ్చితంగా ఈ మొత్తం పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఎలా పెరిగాయో.. వాటిపై కథనాలు రాసిన ఆంధ్రజ్యోతికి తెలియంది కాదు. కానీ అంచనాలు పెంచేశారని చెప్పడం వెనుక అందులో అవినీతి జరుగుతుందని తన పాఠకులకు చెప్పడమే ఆంధ్రజ్యోతి లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇక రివర్స్‌ టెండర్లు అనేవి.. మొదట టెండర్లు పిలిచిన తర్వాతనే రివర్స్‌ టెండర్లకు వెళతారు. అసలు టెండర్లే పూర్తికాకుండానే.. రివర్స్‌ మాట ఎత్తడంలేదంటూ ఆంధ్రజ్యోతి వాపోతోంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. తక్కువకు కోట్‌ చేసిన మొత్తం ఎంతో బహిరంగ పరిచిన తర్వాత.. మళ్లీ టెండర్లు పిలుస్తారు. ఈ సారి కాంట్రాక్టర్లు గతం కన్నా తక్కువకు కోట్‌ చేస్తారు. ఇప్పటి వరకూ అన్ని పనుల్లో ఇదే జరిగింది. కానీ హార్బర్ల విషయలో టెండర్లు పిలిచే వరకూ కూడా ఆంధ్రజ్యోతి ఆగలేకపోతోంది. టెండర్లు పిలవకుండానే… రివర్స్‌ టెండర్లు పిలవడం ఎలా సాధ్యమో ఆంధ్రజ్యోతి తన పాఠకులకు చెప్పే ప్రయత్నం చేస్తుందా..? అనే పశ్న ఎదురవుతోంది.

మొత్తం మీద వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్‌ కథనాలు రాయాలని ప్రయత్నిస్తోన్న ఆంధ్రజ్యోతి.. చివరకు వైఎస్‌ జగన్‌కు మేలు చేసేలా.. చంద్రబాబు పుట్టి ముంచేలా ఉందని టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి