కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీల విషయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుగా స్పందించి చాలామంది వలస కూలీలను బస్సుల ద్వారా ముందుగా కొందరిని స్వస్థలాలకు చేర్చారు. మరోసారి ఏకంగా వలస కూలీల కోసం విమానాలను బుక్ చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అదే బాటలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 4 విమానాలను బుక్ చేయడం ద్వారా వలస కూలీలను తరలించే ఏర్పాట్లు చేశారు.
వివరాల్లోకి వెళితే లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను స్వగ్రామాలకు పంపేందుకు మరోసారి ముందుకొచ్చి తన ఔదార్యాన్ని చాటుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. గతంలో 300 మంది వలస కార్మికుల కోసం 10 బస్సులను ఆయన సమకూర్చిన విషయం తెలిసిందే. కాగా ఈసారి 1000 మంది వలస కార్మికులను విమానాల ద్వారా తరలించేందుకు అమితాబ్ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వలస కార్మికులతో కూడిన రెండు విమానాలు గమ్యానికి చేరుకోగా మరో రెండు విమానాలు బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాయి.
కాగా కూలీలను తరలించేందుకు ముందుగా రైలును బుక్ చేయాలనుకున్న కుదరలేదని అందుకే విమానాల ద్వారా వలస కూలీలను పంపే ఏర్పాట్లు అమితాబ్ చేసారని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా అమితాబ్ కంపెనీలో మేనిజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్ యాదవ్ విమానాలను బుక్ చేశారు. లాక్‌డౌన్ కాలంలో వలస కూలీలు, నిరుపేదలకు అమితాబ్ బచ్చన్ సాయం చేయడం ఇది తొలిసారి కాదు. లాక్‌డౌన్ సమయంలో నిత్యం 2000 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆలిండియా ఫిలిం ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌కి చెందిన నిరుపేదల కుటుంబాలకు నెలవారీ రేషన్ ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో అమితాబ్ చేసిన సాయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్లు ఆయన ఔదార్యాన్ని కొనియాడుతున్నారు.