India Today అల్లు అర్జున్ అరుదైన ఘనత

ఇండియా టుడే మ్యాగజైన్ అంటే ఇప్పటి తరానికి అంత అవగాహన లేకపోవచ్చు కానీ ఓ ఇరవై ఏళ్ళ క్రితం యువతగా ఉన్న వాళ్లకు, ఉద్యోగస్తులకు ఇది బాగా పరిచయమున్న పత్రిక. రాజకీయాలకు సంబంధించి బెస్ట్ కవరేజ్ ఎవరిచ్చే వాళ్లంటే దీని పేరే చెప్పేవారు. ఎన్టీఆర్ చనిపోయిన సమయంలో చెలరేగిన భావోద్వేగాలు, రాజీవ్ గాంధీ హత్య వెనుక కుట్ర కోణం, దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యం, ముంబై పేలుళ్ల వెనుక పెద్ద హస్తాలు, స్మగ్లర్ వీరప్పన్ గురించిన కథనాలు, మత కలహాలను రెచ్చగొట్టే శక్తులు ఒకటా రెండా ఎన్నో కాంటెంపరరీ ఇష్యూస్ మీద వీళ్ళు ఇచ్చినంత కవరేజ్ ఈనాడు లాంటి దిగ్గజాల న్యూస్ పేపర్లు ఇవ్వలేదన్నది వాస్తవం

ఇది ఒక కోణమైతే సినిమాలకు సంబంధించి కూడా ఇండియా టుడే ప్రత్యేకంగా ఫుల్ బుక్ స్టోరీస్ ఇచ్చేది. చిరంజీవి మీద మూడు సార్లు స్పెషల్ ఇష్యూ వేస్తే అభిమానులు హాట్ కేక్ లా కొనేశారు. బాలయ్య మీద ఇచ్చినప్పుడు కొన్ని కాపీలు బ్లాక్ లో అమ్ముడుపోయాయి. పవన్ కళ్యాణ్ ది దొరక్క ఇబ్బంది పడిన ఫ్యాన్స్ ఎందరో. నాగార్జున వెంకటేష్ ల మీద కూడా ఈ మ్యాగజైన్ ఎక్స్ క్లూజివ్ ఎడిషన్స్ ని ప్రింట్ చేసింది. తర్వాత నెట్లు ఫోర్ జీలు వచ్చాక తెలుగు పత్రిక మూతబడిపోయింది. ఇంగ్లీష్ ని మాత్రమే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందరూ మర్చిపోయారనుకుంటున్న టైంలో దీని లేటెస్ట్ ఇష్యూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖచిత్రంతో రావడం పెద్ద విశేషం.

ఎందుకంటే ఎంతో ప్రత్యేకత ఉంటే తప్ప ఇండియా టుడే కవర్ పేజీ మీద ఫోటోలు వేయరు. అలాంటిది బన్నీకి చోటు ఇచ్చారంటే పుష్ప తాలూకు ప్రభావం ఆ రేంజ్ లో ఉందన్న మాట. బాలీవుడ్ మీద దక్షిణాది సినిమాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఈ ఇష్యూలో కొన్ని అంశాలను వివరించారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, మేజర్, విక్రమ్ సక్సెస్ లను ఇందులో ప్రస్తావించారు. అయితే చరణ్ తారక్ కమల్ హాసన్ లాంటి వాళ్ళను కాకుండా బన్నీనే కవర్ మీద వేశారంటే పుష్ప ఇంపాక్ట్ తగ్గేదేలే రూపంలో జాతీయ స్థాయిలో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండింగ్ లో పెట్టేశారు. పుష్ప రాజ్ మేనియా మరి

Show comments