iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు,మాల్స్ మూసివేత – ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు,మాల్స్ మూసివేత – ఆళ్ల నాని

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతిరోజూ కరోనా వైరస్ కట్టడికి సమీక్ష నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖా మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

మీడియా సమావేశంలో ఆళ్ల నాని మాట్లాడుతూ వైరస్ వ్యాప్తిపై అపోహలను కలిగించి ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేసారు. వైరస్ కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని అందులో భాగంగా విద్యా సంస్థలకు ఈ నెల 31 వరకూ సెలవులను ప్రకటించామని వైద్యశాఖా మంత్రి ఆళ్ళ నాని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నామని, తిరుపతి,విజయవాడ,కాకినాడలో ల్యాబ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లా ఆసుపత్రిలోనూ మెడికల్ కాలేజీల్లోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. ప్రజలంతా వైద్య,ఆరోగ్య శాఖాధికారులు చెప్పిన సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసారు.

కొన్ని ఆలయాల్లో రద్దీని తగ్గిస్తామని,దేవాలయాలు , చర్చ్ లు, మసీదులు, యథాతథంగా ఉంటాయని తెలిపారు. థియేటర్లు, మాల్స్ మూసివేస్తామని తెలిపారు. పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలెవరూ కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ళ నాని స్పష్టం చేశారు.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్‌ గేట్‌ను టీటీడీ అధికారులు మూసివేశారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలను నిలిపివేయనున్నారు. అయితే శ్రీవారికి జరిగే ఏకాంత సేవలను అర్చకులు యథాతథంగా నిర్వహించనున్నారు.