iDreamPost
iDreamPost
సంక్రాంతి పండక్కి పోటీ ఎంత ఉన్నా అన్నింటికన్నా ఎక్కువగా యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నవాటిలో అల వైకుంఠపురములోదే మొదటి స్థానం. సరిలేరు నీకెవ్వరు సైతం వసూళ్లు బాగానే రాబడుతున్నప్పటికీ టాక్ పరంగా కొంత డివైడ్ నడుస్తున్న మాటా వాస్తవం. అది ఓవర్సీస్ కలెక్షన్స్ లో స్పష్టంగా బయటపడుతోంది కూడా. ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ సరైన సినిమాతో వచ్చాడని అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వైకుంఠపురములో విజయానికి కారణమైన సూత్రాలేంటో చూద్దాం
1. ట్రీట్మెంట్
ఇందులో కథ కొత్తేమి కాదు. పైగా అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన ఇంటిగుట్టులో కొంత త్రివిక్రమే తీసిన అత్తారింటికి దారేది, జులాయిలో కొంత ఇలా రెండు మూడు సినిమాలను మిక్స్ చేసి స్టోరీ రాసుకున్నారన్న కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇది అబద్దమని చెప్పడానికి లేదు. కానీ ఎంత చూసిన అంశాలే అయినప్పటికీ ట్రీట్మెంట్ పరంగా త్రివిక్రమ్ తీసుకున్న జాగ్రత్త వాటిని మరిపించి దీన్ని కొత్తగా చూస్తున్న అనుభూతి కలిగించింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా స్మూత్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే బోర్ కొట్టించకుండా ఉండటంతో ప్రేక్షకులకు బాగుంది అనే మాట తప్ప ఇంకే ఫీలింగ్ రాలేదు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ని చాలా విభిన్నంగా శ్రీకాకుళం స్లాంగ్ లో పాట పెట్టి డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆనందంతో కూడిన షాక్ కు గురి చేసింది
2. మ్యూజిక్
సినిమా రిలీజ్ కు ముందే లిరికల్ వీడియోకే వంద మిలియన్ల వ్యూస్ సాధించిన సామజవరగమనా పాటతో తమన్ మరోసారి తన సత్తా చాటాడు. అది ఇంకా జనం నోళ్ళల్లో నానుతూ ఉండగానే రాములో రాములా అంటూ అంటూ మరో బ్లాక్ బస్టర్ సాంగ్ తో హుషారెత్తించాడు. ఇక బుట్ట బొమ్మా సంగతి సరేసరి. ఇవన్నీ ఒక ఎత్తైతే నేపధ్య సంగీతంతో దీన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లాడు. ఇంటర్వల్ కు ముందు తప్పు చేసిన మురళి శర్మను చూస్తూ అల్లు అర్జున్ గతంలో ఏం జరిగిందో ఊహించుకుంటున్నప్పుడు వచ్చే స్కోర్ ఒక్కటి చాలు తమన్ పనితనం గురించి చెప్పడానికి.
3. సంభాషణలు
త్రివిక్రమ్ లోని దర్శకుడిని రచయిత ఎప్పుడూ డామినేట్ చేస్తాడు. ఇందులోనూ అదే జరిగింది. చిన్న మాటలను పొదుపుగా వాడుతూ అలా గుర్తుండిపోయేలా చేయడంలో మరోసారి తన మార్క్ చూపించాడు త్రివిక్రమ్. “చరిత్రలో గొప్ప గొప్ప యుద్ధాలన్నీ అయినవాళ్లతోనే జరిగాయి”, “నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది నాన్న.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది”, “మనది మిడిల్ క్లాస్.. లక్ష పనులు కోటి వర్రీస్ ఉంటాయి…తలవొంచుకొని వెళ్లిపోవాలంతే”, “దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే” లాంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే
4. ఆర్టిస్ట్ సెలక్షన్
ఇందులో పాత్రల గొప్పదనం కంటే వాటికి త్రివిక్రమ్ ఎంచుకున్న ఆర్టిస్టులది ఎక్కువని చెప్పొచ్చు. ఇప్పటిదాకా తెలుగులో నటించని మలయాళ నటుడు జయరాం, తమిళ యాక్టర్ సముతిరఖనిలను కీలక పాత్రలకు ఎంచుకోవడం చాలా ఫలితాన్ని ఇచ్చింది. చిన్న రోల్స్ కి సైతం నవదీప్, సుశాంత్, నివేత పేతురేజ్ లాంటివాళ్లను తీసుకోవడం ఎంత ప్లస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. మురళి శర్మ ఇప్పటిదాకా తనలో చూడని కొత్త కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత టబు రీ ఎంట్రీ ఇవ్వడం కలిసి వచ్చింది. పూజా హెగ్డే అందం కూడా స్కోర్ ని పెంచేసింది
5. అల్లు అర్జున్
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండ్ ఆల్వేస్ ది బెస్ట్ అన్న తరహాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో లేకపోతే అల వైకుంఠపురములో ఒక మాములు సినిమాగా మిగిలిపోయేది. ఈగోలు పోకుండా ఇతర హీరోల పాటలకు డాన్స్ చేయడం, హీరోయిజం పరంగా కమర్షియల్ ఎలిమెంట్స్ భారీగా లేకపోయినా కేవలం కథను నమ్మి ఒప్పుకోవడం ఇవన్నీ కోరుకున్న ఫలితాన్ని బంగారు పళ్లెంలో అందించాయి. నిజానికి బన్నీ స్థాయి స్టెప్పులు కానీ ఫైట్లు ఇందులో లేవు. అన్ని చాలా కూల్ గా సింపుల్ గా సాగుతాయి. అయినా కూడా మాస్ కి కనెక్ట్ అయ్యాయంటే బన్నీ బాడీ లాంగ్వేజ్ ఒక కారణంగా చెప్పొచ్చు
చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కారణాలు కనిపిస్తాయి కానీ ఈ ఐదు సూత్రాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. అల వైకుంఠపురములో ఒకరకంగా గత కొన్ని సినిమాలుగా మిస్ అవుతున్న త్రివిక్రమ్ ఒరిజినల్ స్టైల్ ని మళ్ళీ పరిచయం చేసింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఇంతగా దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇది స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఇదే.