Idream media
Idream media
అఖండ ట్రైలర్ చూసినప్పుడే కొంచెం చలి జ్వరం వచ్చింది. అయినా థియేటర్‌లో ఎలాగూ చూడను కదా అని నెమ్మదించాను. బాలయ్య రానే వచ్చాడు. గురువారం కూల్‌గా ఉన్నాను. ఈలోగా ఫేస్‌బుక్ డబ్బాలో రాళ్లు పోసినట్టు గడగడ శబ్దం చేసింది. హిట్ , అదిరింది, జై బాలయ్య అని నినాదాలు కనిపించి, వినిపించాయి. శీనయ్య, బాలపాటి ఇద్దరూ కలిసి ఉతకడం గ్యారెంటీ, వెళితే కొంచెం కామెడీగా వుంటుందనిపించింది. నిజానికి బాలయ్య సినిమాలో మంచి ఫన్ వుంటుంది. ఆయన సీరియస్‌గా వుంటాడు. అదే ఫన్.
శుక్రవారం సాయంత్రం ఇనార్బిట్‌కి వెళ్లాను. అభిమానులు ఫుల్‌గా వచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్ కూడా ఫుల్. మూవీ స్టార్ట్ కాక ముందే కోకాకోలా , పెప్సీ- బాలయ్య బాబు సెక్సీ అని అరుపులు. 60 ఏళ్ల వయసులో ఆయనలో ఏం సెక్సీ కనిపించిందో. తర్వాత జైబాలయ్య కేకలు.
సినిమా స్టార్ట్ అయ్యింది. జాతరలో మేకపోతులా భయంగా కూచున్నా. అడవిలో మిల్టరీ వాళ్లు ఒక క్రిమినల్‌పై కాల్పులు. రాకెట్ లాంచర్లు, మెషిన్‌గన్స్ వాడి మిలటరీని అతను లేపేసాడు. తానూ గాయపడ్డాడు. కట్ చేస్తే కర్నాటకలోని ఏదో ఊరు. ఒకావిడకి కవలలు పుట్టారు. అందులో ఒకడికి చలనం లేదు. ఇంతలో దట్టమైన గడ్డాలుమీసాలు, పొడవాటి త్రిశూలంతో జగపతిబాబు వచ్చాడు. ఆ గడ్డంలోకి పొరపాటున ఒక తొండ దూరినా జన్మలో బయటికి రాలేదు. వాయిస్ బట్టి జగపతిబాబుని గుర్తు పట్టాను. ఒక పిల్లాన్ని చూపించి వీడు ప్రళయం అని తీస్కెళ్లిపోయి ఒక సాధువుకి ఇస్తాడు. ఆయన రైలెక్కి కాశీ వెళ్లిపోతాడు.
కట్ చేస్తే బాలయ్య రైతుగా ఎంట్రీ. బ్యాటరీ రంపాలతో ఆయన మీద రౌడీలు పడతారు. ఒక్కో దెబ్బకి నలుగురైదుగురు గాలిలోకి ఎగురుతారు. బాలయ్య ఒక పంచ్ ఇవ్వడం స్లో మోషన్‌లో వాళ్లు గాల్లోకి ఎగరడం.
1727లో చనిపోయిన న్యూటన్‌ని ఎవరైనా సంజీవిని విద్య ప్రయోగించి బతికించి ఈ సీన్స్ చూపిస్తే గురుత్వాకర్షణ శక్తి అనే సిద్ధాంతాన్ని తాను కనిపెట్టలేదని ఒప్పుకుని ప్రజలకి క్షమాపణ చెప్పి బోయపాటికి , బాలయ్యకి కాళ్లకి దండం పెట్టి మళ్లీ సమాధిలోకి వెళ్లి పలకని తానే కప్పేసుకుంటాడు.
ఈ ఫైటింగ్‌ని మారువేషంలో ఉన్న కలెక్టరమ్మ (హీరోయిన్) చూసి హీరోని అరెస్ట్ చేయాలనుకుని , తర్వాత ఆయన మంచితనం తెలిసి ఆలస్యం చేస్తే బాగుండదని కల్లు తాగి , తాగించి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకో కూతురు కూడా పుడుతుంది.
కథలోకి శ్రీకాంత్ అనే విలన్ వస్తాడు. రాగి గనులు తవ్వుతుంటే యురేనియం దొరుకుతుంది. దాంతో ఆ ప్రాంత జనాలకి అనారోగ్యం (యురేనియం దొరికినా అదేం తాటి బెల్లం కాదు, రైతు బజార్లో అమ్మడానికి). వాళ్లు ఆస్పత్రులపాలైతే హీరో వెళ్లి అందర్నీ తన్ని మైన్ మూసేయమంటాడు. తర్వాత ఆస్పత్రిలో బ్లాస్ట్, హీరో అరెస్ట్, హీరోయిన్ సస్పెన్షన్.
పాపకి బాగలేకపోతే హీరోయిన్ కారులో బయలుదేరుతుంది. శ్రీకాంత్ మనుషులు అటాక్. తప్పించుకోడానికి ఒక గుహలోకి వెళితే శివుడి విగ్రహం ముందు ఒకాయన. ఆయనే అఖండ.
సెకెండాఫ్‌లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ.
రైతు బాలయ్య కొంచెం పద్ధతిగా కొడతాడు. అఖండ అఘోరా. పద్ధతులు లేవు. కత్తితో పొడుస్తాడు, తుపాకితో కాలుస్తాడు, శూలంతో గుచ్చుతాడు, గొడ్డలి, గండ్ర గొడ్డలి, గొలుసులు, కర్ర, ట్రాక్టర్ల టైర్లు, సుత్తి, ఇంజన్ విడిపరికరాలు. చేతికి ఏం దొరికితే దాంతో కొడతాడు. థియేటరే బ్లడ్ బ్యాంక్‌లాగా మారిపోతుంది. బడ్జెట్‌లో ఎర్ర రంగుకే సుమారుగా అయ్యి వుంటుంది.
అఖండ ఎంత గట్టి పిండమంటే ఒక శూలం, గొడ్డలి, గండ్ర గొడ్డలి వీపుకి గుచ్చుకున్నా ఏం కాదు. ఇలాగైతే లాభం లేదని గన్ పేలుస్తారు. అప్పటి వరకు పెద్దపెద్ద గడ్డాలు, మీసాలు మోసిన జగపతిబాబు బుల్లెట్‌కి ఎదురెళ్లి సీన్‌లో నుంచి తప్పుకుంటాడు. క్లైమాక్స్‌లో ఇద్దరి బాలయ్యలకి అదనంగా రెండు కోడెగిత్తలొచ్చి కుమ్ముతాయి. ఇన్ని రకాల ఆయుధాలతో జనాన్ని హింసించ వచ్చని కనిపెట్టిన బోయపాటి, స్టంట్ డైరెక్టర్లకి అభినందనలు.
తమన్ మనల్ని భయపెట్టడానికి సమస్త వాయిద్యాలని వాడాడు. అన్నం తిన్న ఇంటి పెద్ద తలని నరకడం, వ్యాపారాన్ని అడిగిన వాడికి బొచ్చు ఇవ్వడం ఇలాంటి సీన్స్ బోయపాటే తీయగలడు. కొడుకు ఎదురుగా తల్లి రేప్ పరాకాష్ట.
జనం వస్తున్నారని అంటున్నారు.
యథా ప్రేక్షకః తథా సినిమాః
Also Read : Akhanda Review : అఖండ రివ్యూ