iDreamPost
android-app
ios-app

Air Services – భారతదేశంలో విమానయానం మొదలైన రోజు

Air Services  –  భారతదేశంలో విమానయానం మొదలైన రోజు

అక్టోబర్ 15,1932 ఉదయం కరాచీలోని, దృఘ్ రోడ్డులో ఉన్న చిన్న విమానాశ్రయం నుంచి 25 కేజీల బరువున్న నాలుగు అణాల ఎయిర్ మెయిల్ ఉత్తరాలున్న పోస్టల్ బ్యాగులతో ఒక ఇంజన్ ఉన్న డీహావిలాండ్ పుస్ మాత్ విమానం గాలిలోకి ఎగరడంతో నాటి బ్రిటిష్ ఇండియాలో పౌరవిమానయానం మొదలైంది. టాటా ఎయిర్ సర్వీసెస్ కంపెనీకి చెందిన ఆ విమానాన్ని టాటాల వారసుడు, పైలట్ లైసెన్సు పొందిన మొదటి భారతీయుడు, జేఆర్డీగా పిలవబడే జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా నడిపాడు.

కరాచీ నుంచి అహ్మదాబాద్ వచ్చి, అక్కడ ఇంధనం నింపుకుని బొంబాయి జుహూ విమానాశ్రయంలో కొన్ని ఉత్తరాల సంచులు దించి, అక్కడ నుంచి బెళ్ళారి విమానాశ్రయంలో ఇంధనం నింపుకుని, మద్రాసులో మిగిలిన ఉత్తరాలు చేర్చడంతో నాటి బ్రిటిష్ ఇండియాలో టాటాల నాయకత్వంలో పౌరవిమానయానం మొదలైంది.

1911లో దేశంలో ఎగిరిన మొదటి విమానం.. 

బ్రిటిష్ ఇండియాలో మొదటి సారిగా విమానం 1911లో ఎగిరింది. 18 ఫిబ్రవరి 1911లో అలహాబాద్ లో జరిగిన పారిశ్రామిక ప్రదర్శనలో భాగంగా ఇంగ్లాండు నుంచి ఓడలో తీసుకొచ్చిన హంబర్ కంపెనీకి చెందిన విమానంలో అలహాబాద్ నుంచి యమునా నదికి అవతల తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనీ అనే ఊరికి ఉత్తరాలు సరఫరా చేశాడు హెన్రీ పెకెట్ అనే ఫ్రెంచ్ పైలట్.

టాటాలకు స్ఫూర్తి నెవిల్ విన్సెంట్

ఫ్రాన్స్ కు చెందిన సూనీ బ్రియెరీ, రతన్జీ దాదాభాయ్ టాటాలకి జన్మించిన జేఆర్డీ ఇరవై నాలుగేళ్ల వయసు వచ్చే వరకూ ఫ్రాన్స్ పౌరుడిగా అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న విమానయానం మీద మక్కువ పెంచుకున్నాడు జేఆర్డీ. దాంతో ఇరవై నాలుగేళ్ల వయసులో ఇండియాకి వచ్చిన జేఆర్డీ కొత్తగా ఏర్పడిన ఫ్లైయింగ్ క్లబ్ లో చేరి పైలట్ శిక్షణ పొంది, దేశంలోనే పైలట్ లైసెన్సు పొందిన మొదటి భారతీయుడు అయ్యాడు. అయితే హాబీగా విమానాలను నడుపుతున్న జేఆర్డీ టాటాను 1929 లో మాజీ యుద్ధ పైలట్ నెవిల్ విన్సెంట్ కలిశాడు.

Also Read : భారత జట్టు మొదటి క్రికెట్ టెస్టు ఆడిన రోజు

మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాయుసేన రాయల్ ఎయిర్ ఫోర్సులో పైలట్ గా పని చేసిన నెవిల్ విన్సెంట్ యుద్ధం తరువాత బోర్నియోలో తపాలా బట్వాడా చేసే విమానాలు నడిపాడు. అయితే భారత దేశంలో విమానయాన కంపెనీ ఒకటి మొదలుపెడితే బాగా లాభదాయకంగా ఉంటుందని భావించిన విన్సెంట్ బోర్నియోలో ఉద్యోగం మానివేసి ఇండియా వచ్చాడు. అయితే అతని దగ్గర కంపెనీ పెట్టాలన్న ఐడియాతో పాటు పైలట్ గా పనిచేసిన నైపుణ్యం, అనుభవం ఉన్నాయి కానీ పెట్టుబడికి అవసరమైన డబ్బు లేదు.

పెట్టుబడి పెట్టగల భాగస్వామిని అన్వేషిస్తూ బొంబాయిలో పేరుమోసిన వస్త్ర వ్యాపారి రూసా మెహతాని కలిశాడు. అతను విన్సెంట్ ప్రతిపాదనను మెచ్చుకొన్నాడు కానీ మూడు నెలలు గడిచినా ఏ విషయం తేల్చకపోవడంతో విన్సెంట్ అన్వేషణ మళ్ళీ మొదలైంది.

ఆ సంవత్సరమే ఫ్రాన్స్ నుంచి ఇండియాకి వచ్చి, ఇక్కడ పౌరసత్వం స్వీకరించి, కొన్ని రోజుల ముందు పైలట్ లైసెన్సు పొందిన టాటాల వారసుడు జేఆర్డీ టాటా గురించి తెలుకున్న విన్సెంట్ అతన్ని కలిశాడు. ఫ్రాన్సులో ఉన్నప్పటి నుంచి విమానయానం పట్ల ఆసక్తి ఉన్న జేఆర్డీని విన్సెంట్ ఆలోచన బాగా ఆకట్టుకుంది. దేశంలో విమానయాన సంస్థ ఆవశ్యకత, దాని ఎదుగుదలకి ఉన్న అవకాశాల గురించి విన్సెంట్ చెప్పిన తీరు నచ్చిన జేఆర్డీ ఒక ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించి, టాటా సంస్థల ఛైర్మన్ దోరాబ్జీ టాటాను కలిశాడు. దోరాబ్జీకి ఈ విషయం మీద అవగాహన లేకపోవడంతో కొంత తటపటాయించినా ప్రాజెక్టుకు కావలసిన పెట్టుబడి రెండు లక్షల రూపాయలే కావడంతో ఆమోదం తెలిపాడు.

విమానయాన సంస్థని ప్రారంభించడానికి అనుమతి కోరుతూ టాటా సంస్థ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఒక భారతీయ కంపెనీ చేతిలో విమానయాన సంస్థ ఉండడం ఇష్టంలేని నాటి బ్రిటిష్ ప్రభుత్వం రకరకాల కారణాలతో అనుమతి ఇవ్వడం వాయిదా వేస్తూ వచ్చింది. దీంతో విసుగు చెందిన దోరాబ్జీ ఆ ప్రతిపాదనను రద్దు చేసుకోవాలనుకున్నాడు. అయితే నెవిల్ విన్సెంట్ పట్టువదరకుండా నాటి వైస్రాయ్ లార్డ్ విల్లింగ్డన్ అపాయింట్ మెంట్ కోరాడు. అది వేసవి కాలం కావడంతో ప్రభుత్వం మొత్తం ఢిల్లీ నుంచి వేసవి రాజధాని అయిన సిమ్లాకి తరలి వెళ్ళింది.

విన్సెంట్ 1931లో సిమ్లాలో లార్డ్ విల్లింగ్డన్ ని కలిసి తమ ప్రాజెక్టు గురించి వివరించి ఆమోదముద్ర వేయించాడు. ఏప్రిల్ 1932 లో టాటా ఎయిర్ సర్వీసెస్ కంపెనీకి పది సంవత్సరాల లైసెన్సు ఇచ్చింది నాటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సంవత్సరం అక్టోబర్ 15న కరాచీ నుంచి అహ్మదాబాద్ మీదుగా బొంబాయికి, అక్కడ నుంచి బెళ్ళారి మీదుగా మద్రాసుకి జేఆర్డీ టాటా నడిపిన విమానంతో బ్రిటిష్ ఇండియాలో పొర విమానయానం మొదలైంది.

Also Read : పోలియో వైరసుకు మరణశాశనం రాసిన రోజు

రైలు ప్రయాణం కన్నా తక్కువ ధరలోనే కరాచీ – బొంబాయి – మద్రాసు విమానం మొదట్లో వారానికి ఒకసారి మెయిల్ బట్వాడా కోసం మొదలైనా ఆ తర్వాత ప్రయాణీకుల రవాణా కూడా మొదలుపెట్టింది. మొదటి సంవత్సరంలో 2,60,000 కిలోమీటర్లు కవర్ చేసి, 155 మంది ప్రయాణికులని గమ్యం చేర్చి, అరవై వేల రూపాయల లాభం ఆర్ఛించింది టాటా ఎయిర్ సర్వీసెస్ కంపెనీ. పర్ఫెక్షనిస్టు అయిన జేఆర్డీ టాటా పర్యవేక్షణలో ఆ సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా విమానం ఆలస్యం కాకుండా నడిచింది.

1938లో టాటా ఎయిర్ లైన్స్ గా పేరు మార్చుకున్న ఈ సంస్థ తిరువనంతపురం, ఢిల్లీ, శ్రీలంక రాజధాని కొలంబోలకు విమానాలు నడపడం మొదలు పెట్టింది. ఆదాయం ఎక్కువ కావడంతో టిక్కెట్ ధరలు కూడా తగ్గాయి. 1939లో బొంబాయి – ఢిల్లీ మొదటి తరగతి రైలు టికెట్ కన్నా తక్కువ ధరలో విమానం టికెట్ ఉండేది.

1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు కావడంతో బ్రిటిష్ వాయుసేన టాటా కంపెనీ విమానాలను తన ఆధ్వర్యంలోకి తీసుకుని సైన్యాన్ని, సామగ్రిని తరలించడానికి ఉపయోగించింది. యుద్ధం ముగిసిన తర్వాత 1946 జులైలో ఎయిర్ ఇండియా పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. 1948లో భారత ప్రభుత్వం ఈ కంపెనీలో 49 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. అదే సంవత్సరం జూన్ 9న మలబార్ ప్రిన్సెస్ అనే పేరున్న ఒక లాక్ హీడ్ కంపెనీ విమానం బొంబాయి – లండన్ నగరాల మధ్య మొదటి అంతర్జాతీయ ప్రయాణం చేసింది.

1953లో ఎయిర్ కార్పొరేషన్ యాక్ట్ అనే చట్టం ద్వారా 2.8 కోట్ల రూపాయలు చెల్లించి టాటాల వాటాను కొని ఎయిర్ ఇండియా కంపెనీని జాతీయం చేసింది భారత ప్రభుత్వం. ఈ ఒప్పందంలో భాగంగా జేఆర్డీ టాటా 1977 వరకూ కంపెనీ ఛైర్మన్ గా కొనసాగాడు. మళ్ళీ 44 సంవత్సరాల తర్వాత ఎయిర్ ఇండియా కంపెనీని 18 వేల కోట్ల రూపాయలు వెచ్చించి బహిరంగ వేలంలో కొని, రతన్ టాటా రూపంలో మరొక టాటా ఎయిర్ ఇండియా కంపెనీ అధినేత కాబోతున్నాడు.

అనవసర ఖర్చులు తగ్గించుకొని, సమయపాలన, క్రమశిక్షణతో ఎయిర్ ఇండియా మహరాజా ప్రయాణీకూలను ఆకట్టుకొని టాటాల నాయకత్వంలో మరలా లాభాల బాట పట్టాలని దేశ ప్రజలందరి ఆకాంక్ష.

Also Read : వివాదాస్పదం నెప్ట్యూన్ గ్రహ ఆవిష్కరణం