Idream media
Idream media
కరోన కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో దేశం స్తంభించింది. రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ఈ నెల 14వ తేదీ వరకూ కొనసాగనుంది. ఆ తర్వాత పొడిగిస్తారా..? లేదా..? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయితే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పొడిగింపునకే కేంద్రం మొగ్గు చూపే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.
లాక్‌డౌన్ పొడిగింపు తప్పదనే సంకేతాలు రైల్వే శాఖ ద్వారా వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ వరకూ రైల్వే సర్వీసులన్నింటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి నగుదు వాపసు ఇచ్చింది. లాక్‌డౌన్ ఎత్తివేస్తే 15వ తేదీ నుంచి టిక్కెట్ బుకింగ్ అనుమతించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే రోజుల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. కరోన నియంత్రణలోకి రాకపోవడంతో లాక్‌డౌన్ కొనసాగించాలనే రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం పునరాలోచనలో పడినట్లుంది. అక్కడ నుంచి వచ్చిన సమాచారంతోనే.. రైల్వే టిక్కెట్ బుకింగ్ విభాగం ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌లో టిక్కెట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రైల్వే శాఖ ఐఆర్‌సీటీసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ ఆర్‌టీసీ మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తుండడంతో 15వ తేదీ నుంచి బస్సులు తిప్పేందుకు సిద్ధమైంది. 15వ తేదీ నుంచి టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దూర ప్రాంత ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒక వేళ లాక్‌డౌన్ పొడిగిస్తే.. టిక్కెట్ సొమ్ము పూర్తిగా వెనక్కు ఇస్తామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.