iDreamPost
iDreamPost
షూటింగ్ ఎప్పుడో పూర్తయిందన్నారు. ప్రభాస్ తన పార్ట్ ఫినిష్ చేసి ఎప్పుడో గుడ్ బై చెప్పి ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు. కానీ ఆదిపురుష్ తాలూకు అప్డేట్స్ మాత్రం నెలల తరబడి రావడం లేదు. 2023 జనవరి 12 విడుదల దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే నిజమైతే చేతిలో ఉన్నది కేవలం నాలుగు నెలలు. ఇంకా ఒక పాట కాదు కదా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయలేదు. టీజర్, ట్రైలర్, మల్టీ లాంగ్వేజ్ ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్, అవుట్ డోర్ విజిట్స్ ఒకటేమిటి చాలా పనులుంటాయి. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి తన హీరోలు తారక్ చరణ్ లను వెంటబెట్టుకుని పబ్లిసిటీ కోసం దేశమంతా ఎలా తిరిగాడో చూశాంగా!
దీంతో టీమ్ ని నమ్ముకుని లాభం లేకంగా ఏకంగా ఫ్యాన్సే కాన్సెప్ట్ పోస్టర్లను తయారు చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నిమేష్ షిర్ శత్ అనే ఆర్టిస్టు వేసిన బొమ్మ ఇప్పుడు మాములు హంగామా చేయడం లేదు. అందులో ప్రభాస్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయనే అవగాహనతో వేసిన బొమ్మ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంతగా అంటే నిజంగానే ఇది అఫీషియల్ అనుకునేలా. తానాజీతో జాతీయ అవార్డు సాధించిన ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ డ్రామా రామాయణ గాధ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కృతి సనన్ సీతగా, విలన్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. ఇంతకు మించి డీటెయిల్స్ చెప్పలేదు.
అయినా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆదిపురుష్ విషయంలో ఎందుకింత నిర్లిప్తత ఉందనేది అంతు చిక్కడం లేదు. అసలే దేశంతో హిందుత్వ సెంటిమెంట్ సినిమాలకు నార్త్ సౌత్ తేడా లేకుండా బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది.కార్తికేయ 2లో శ్రీకృష్ణుడి కాన్సెప్ట్ ఈ కారణంగానే ఉత్తరాది ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యింది. అలాంటిది రాముడి వేషంలో ప్రభాస్ కనిపిస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా. అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతున్న టైంలోనే ఆదిపురుష్ కి శ్రీకారం చుట్టడం కాకతాళీయం అయినా కాకపోయినా ఇకనైనా టి సిరీస్ బృందం మేల్కోవడం అవసరం. వందల కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవడం కాదు దానికి తగ్గ ప్రమోషన్ చేయాలిగా!