iDreamPost
android-app
ios-app

ఆది నారాయణరెడ్డి బావ కూడా వైసీపీలో చేరుతున్నాడంట!!

  • Published Mar 11, 2020 | 7:30 AM Updated Updated Mar 11, 2020 | 7:30 AM
ఆది నారాయణరెడ్డి బావ కూడా వైసీపీలో చేరుతున్నాడంట!!

జమ్మలమడుగు నియోజకవర్గంలో చదిపిరాళ్ల కుటుంబానిది కండబలమైతే తాతిరెడ్డి కుటుంబానిది రాజకీయ, ఆర్థిక అండ. జమ్మలమడుగు నియోజకవర్గంలో 1951 నుంచీ తాతిరెడ్డి కుటుంబీకులు ఎమ్మెల్యే పదవికీ పోటీ చేస్తూ వస్తున్నారు. రెండు సార్లు తాతిరెడ్డి పుల్లా రెడ్డి ఓడిపోగా, తాతిరెడ్డి నరసింహారెడ్డి (టీఎన్‌ఆర్‌) రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలుగుదేశం ఆవిర్భాం నుంచి శివారెడ్డి (బాంబుల శివారెడ్డి) హవా మొదలైంది. వారి ప్రత్యర్థులుగా అనేక మంది కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసినా 2004 వరకూ ఎవరూ గెలవలేకపోయారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శివారెడ్డి పై కాంగ్రెస్‌ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. శివారెడ్డి, ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షన్‌ గొడవల్లో అనేక మంది చనిపోయారు.

2004లో రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆదినారాయణ రెడ్డికి కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కగా.. ఆయన శివారెడ్డి వారసుడు రామసుబ్బారెడ్డిపై గెలిచారు. 2009, 2014లో కూడా ఆదినారాయణ రెడ్డి గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశపడో లేదా మరో ప్రలోభానికి లొంగో టీడీపీలోకి ఫిరాయించారు. మంత్రి అయ్యారు. అదే ఆదినారాయణ రెడ్డి రాజకీయ పతనానికి కారణమైంది.

2019లో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చిన చంద్రబాబు ఆదిని కడప ఎంపీగా, రామ సుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బరిలో దింపగా రెండు చోట్ల ఘోర పరాజయం ఎదురైంది.

మొదటి నుంచీ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సన్నిహితులైన ఆది కుటుంబం జగన్‌ సీఎం అయినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విలేకర్ల సమావేశం పెట్టి బహిరంగంగా జగన్‌కు మద్ధతు ప్రకటించారు. ఆదినారాయణ రెడ్డి మరో సోదరుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఒక రకంగా ఆదినారాయణ రెడ్డి తన కుటుంబంలో రాజకీయంగా ఒంటరివాడయ్యాడు.

ప్రస్తుత విషయానికి వస్తే రామసుబ్బారెడ్డితోపాటు ఆదినారాయణ రెడ్డి బావ తాతిరెడ్డి సూర్యం ఈ రోజు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డిని కలిశారు. ఈ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సీఎం జగన్‌ సమక్షంలో వారిరువురు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.

సూర్యం (సూర్యనారాయణ రెడ్డి) ఆదినారాయణ రెడ్డి సోదరిని వివాహం చేసుకున్నారు. సూర్యం తండ్రి నరసింహారెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. సూర్యం శ్రీమతి జమ్మలమడుగు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా పని చేశారు. సూర్యం జమ్మలమడుగు టౌన్‌ బ్యాంకు చైర్మన్‌గానూ, జమ్మలమడుగు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గాను పని చేశారు.

సూర్యం వైఎస్సార్‌సీపీ చేరికతో జమ్మలమడుగు టౌన్‌లో ఆదినారాయణ రెడ్డి వర్గానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే.