Idream media
Idream media
ఈఎస్‌ఐలో జరిగిన కుంభకోణంలో మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు ఆధారాలున్నాయని ఏసీబీ వెల్లడించింది. పక్కా ఆధారాలతో అచ్చెన్నాయుడుతో పాటు మరో ఆరుగురు ఈఎస్‌ఐ అధికారులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 2014 నుంచి 2019 మధ్యలో ఈఎస్‌ఐ వైద్య పరికరాలు, మందులు కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలిందని పేర్కొంది. విజిలెన్స్ దర్యాప్తు నివేదికను ఏసీబీకి ఇచ్చిందని జాయింట్ డైరెక్టర్ తెలిపారు. తాము కూడా విచారణ జరిపిన తర్వాత అధారాలు సేకరించి అరెస్ట్‌లు చేస్తున్నామని చెప్పారు.
ఏసీబీ దర్యాప్తు తర్వాత 150 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తేలిందని జేడీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మందులు, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాలు, ఫర్నీచర్, బయోమెట్రిక్ యంత్రాలను 50 నుంచి 130 శాతం ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు గుర్తించామని వెల్లడించారు. మాజీ డైరెక్టర్ సీకే రమేష్‌కుమార్ తన బంధువుల పేర్లుతో నకిలీ ఇన్‌వాయిస్‌లు, బిల్లులుతో నామినేషన్ విధానంలో ఈ కుంభకోణానికి తెరతీశారని ఏసీబీ అధికారి వెల్లడించారు.
ఈ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ సీకే రమేష్‌కుమార్, రాజమండ్రికి చెందిన డైరెక్టర్ విజయ్‌కుమార్, మాజీ జాయింట్ డైరెక్టర్ వి. జనార్థన్, సూపరింటెండెంట్ ఎంబీకే చక్రవర్తి, మరో అధికారి వి.రమేష్‌బాబులను అరెస్ట్ చేశామని తెలిపారు. వీరందరినీ ఈ రోజు సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసి చర్యలు చేపడుతున్నామని ఇందులో రాజకీయం ఏముంటుదని ఏసీబీ అధికారి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రొసీజర్స్ పూర్తి చేసిన తర్వాతనే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. టెలీ హబ్ ఇన్సూ్యరెన్స్‌లో వైద్యం చేసిన వారికే కాకుండా నమోదైన ప్రతి ఒక్కరికీ బిల్లులు చేసుకుని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కూడా తెలిసిందని చెప్పారు. బయో మెడికల్ వేస్ట్‌లో కూడా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. వీటిపై కూడా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.