Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు ఫ్రస్ట్రేషన్ తారా స్థాయికి చేరుతోంది. రాజకీయ వ్యతిరేక పవనాలు, అరెస్ట్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అచ్చెం నాయుడు కాలజ్ఞానం చెబుతున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బల్లగుద్ధి మరీ చెబుతున్న అచ్చెం నాయుడు.. ప్రభుత్వంలో తన స్థానం ఎలా ఉంటుందో కూడా సెలవిస్తున్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తానే హోం మంత్రినని చెబుతున్నారు. సొంత గ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించిన కేసులో అచ్చెం నాయుడు అరెస్ట్ అయ్యారు. పోలీసులు అచ్చెం నాయుడు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. కోర్టు ఈ నెల 15వ తేదీ వరకు రిమాండ్ విధించింది. 4 దశాబ్ధాలుగా అధిపత్యం చెలాయిస్తున్న ఊరిపై పట్టుపోతోందనే ఉక్రోషం, పోలీసుల అరెస్ట్‌తో వచ్చిన ఫ్రస్ట్రేషన్ అచ్చెం నాయుడు చేత భవిష్యత్ ఏమిటో చెప్పించాయి.
అరెస్ట్ నేపథ్యంలో పోలీసులపై మండిపడిన అచ్చెం నాయుడు వారిని తీవ్రస్వరంతో బెదిరించారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తాను హోం మంత్రిని అవుతానని, పోలీసులు ఎక్కడ ఉన్న వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తన బెడ్‌రూంలోకి వచ్చి మరీ అరెస్ట్ చేసిన పోలీసులను తప్పకుండా శిక్షిస్తానని పేర్కొన్నారు. ఎప్పుడూ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే అచ్చెం నాయుడు.. ఈ సారి మాత్రం కేవలం పోలీసులనే లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. పైగా తాను నాయకుల తీరును తప్పుబట్టడం లేదని, పోలీసుల తీరునే తప్పుబడుతున్నానంటూ అచ్చెం నాయుడు మాట్లాడడం ఆసక్తికరం.
పోలీసులను ఈ తరహాలో బెదిరించడం టీడీపీ నేతలకు పరిపాటైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకుని నారా లోకేష్, అచ్చెం నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి సహా పలువురు నాయకులు డీజీపీ నుంచి డీఎస్పీ స్థాయి పోలీసుల వరకూ ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. అంతుచూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ విమరమణ చేసినా.. వదిలిపెట్టబోమంటూ శపథాలు చేస్తున్నారు. చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినా, అరెస్ట్ చేసినా.. టీడీపీ నేతలు పై విధంగా ఫైర్ అవుతున్నారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గొడవ పడినా, ఏదైనా దాడి జరిగినా.. టీడీపీ నేతలు పోలీసులనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ.. తీవ్ర పదజాలం ఉపయోగిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. అయినా.. టీడీపీ నేతల తీరు మాత్రం మార్చుకోవడం లేదని ఈ రోజు అరెస్ట్ సమయంలో అచ్చెం నాయుడు, పట్టాభిరాంపై జరిగిన దాడి నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడిన తీరును బట్టి స్పష్టమవుతోంది.