Idream media
Idream media
ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఇంటిపై IT అధికారులు ఇవాళ (గురువారం) ఉదయం నుండి దాడులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ చంద్రబాబు వద్ద సుధీర్ఘ కాలం పాటు పీఏగా పనిచేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలైన తర్వాత శ్రీనివాస్ తిరిగి తన స్వంత డిపార్ట్‌మెంట్ అయిన సాధారణ పరిపాలన శాఖకు (జేఈడీ)కి వెళ్లిపోయారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో, తర్వాత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ శ్రీనివాస్ చంద్రబాబు వద్ద పీఏగా పనిచేశారు. 2014నుండి 2019 ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు శ్రీనివాస్ చంద్రబాబు వద్దే ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలైన తర్వాత శ్రీనివాస్ తన ఉద్యోగానికి వెళ్లారు.. ఆయన సతీమణి కూడా ప్రభుత్వ ఉద్యోగియేనట.. అయితే శ్రీనివాస్ ఇంటిపై గురువారం ఉదయం 7గంటల నుండి IT అధికారులు సోదాలు నిర్వహించడం ఇపుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
శ్రీనివాస్ ఇంట్లో త్వరలో శుభకార్యం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుండగా.. ఈ తరుణంలో సోదాలు కలకలం రేపుతున్నాయి.. పూర్తి సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరు అయితే ఇవి ఐటీ దాడులుగా చెప్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం రావాల్సిఉంది.