iDreamPost
iDreamPost
ప్రేమకథలు ప్రతిసారి కొత్తగా చెప్పలేము. అలా అని ప్రేక్షకులు వీటిని బోర్ గా ఫీలవుతారని కాదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని బట్టి చెబుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఆధారపడి ఉంటుంది. లవ్ స్టోరీస్ కి సంగీతం ప్రధానం. ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే కథా కథనాలు కాస్త అటుఇటుగా ఉన్నా ఆ సినిమా ఎన్ని తరాలు మారినా అలా గుర్తుండిపోతుంది. అలాంటి చిత్రమే అభినందన. 1969లో తమిళ సినిమా ‘జన్మభూమి’తో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టిన అశోక్ కుమార్ తన ప్రతిభతో తక్కువ సమయంలో టాప్ కెమెరా మెన్ గా దూసుకుపోయారు. దాదాపు అందరు స్టార్ హీరోలకు పని చేసిన ట్రాక్ రికార్డు ఆయనది.
అశోక్ కుమార్ కు ఎప్పటి నుంచో దర్శకత్వం చేయాలన్నది కోరిక. ఆ తృష్ణతోనే 1987లో హిందీలో కామాగ్ని, తమిళంలో ఉల్లం కవర్న్దా కల్వన్ తీసి తన అభిరుచిని చాటుకున్నారు. తెలుగులోనూ ఎప్పటికీ చెప్పుకునే ఒక ప్రేమకథను తీయాలన్న ఆలోచనతో రాసుకున్న కథే అభినందన. 1982లో రాజశ్రీ సంస్థ తీసిన ‘నదియా కె పార్’ సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో పాయింట్ అశోక్ కుమార్ కు బాగా నచ్చింది. దాన్నే కొద్దిపాటి కీలక మార్పులతో దాసరి తీసిన ‘స్వయంవరం’ ట్విస్టుని జోడించి రాసుకున్నారు. ఇళయరాజా పదికాలాలు నిలిచిపోయే పాటలకు హామీ ఇచ్చారు. కార్తీక్ శోభనను జంటగా తీసుకుని తక్కువ టైంలోనే షూటింగ్ పూర్తి చేశారు.
అక్క చనిపోతే ఆమె చెల్లి బావను పెళ్లి చేసుకునే అవసరాన్ని సృష్టించి మధ్యలో ప్రేమించినవాడి జీవితాన్ని నరకప్రాయం చేయడం, ఆ తర్వాత ఆ బావ త్యాగంతో ప్రేమ జంట మళ్ళీ ఒక్కటి కావడం ఇందులో కీలక అంశం. ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులు సృష్టించిన ‘హమ్ ఆప్కే హై కౌన్'(రాజశ్రీ నిర్మాణం)లోనూ ఇదే చూడొచ్చు. అయితే కథకన్నా ఎక్కువగా అభినందనలో పాటలకు సంగీత ప్రియులు దాసోహం అన్నారు. ఆత్రేయ రాసిన ప్రతి పాటా ఆణిముత్యం. ‘ప్రేమ ఎంత మధురం’ని యువకులు ఎంత వెర్రెక్కి విన్నారో వర్ణించడం కష్టం. 1988 మార్చి 10న రిలీజైన అభినందన కేవలం రెండు రోజుల గ్యాప్ తో వచ్చిన ఆఖరి పోరాటం పోటీని తట్టుకుని హిట్ కొట్టింది. శరత్ బాబు నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. అంతేకాదు అభినందన మూడు నంది అవార్డులు సొంతం చేసుకుంది.