iDreamPost
android-app
ios-app

అదరగొడుతున్న ఆరోగ్యసేతు

అదరగొడుతున్న ఆరోగ్యసేతు

కరోనా వైరస్‌ నివారణలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ, ఈ వ్యాధి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించేందుకు భారత్‌ తయారు చేసిన ఆరోగ్యసేతు యాప్‌ నెట్టింట్లో అదరగొడుతోంది. కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుండడంతో ఆ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఏప్రిల్‌ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన టాప్‌ టెన్‌ డౌన్‌లోడ్లలో ఆరోగ్య సేతు యాప్‌కు చోటు దక్కింది. మన దేశంలో అభివృద్ధి చేసిన యాప్‌ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అన్ని రకాల డౌన్‌లోడ్లను పరిశీలిస్తే (నాన్‌ గేమింగ్‌) ఆరోగ్య సేతు యాప్‌ ఏడో స్థానం దక్కించుకుంది. గూగుల్‌ ప్లే డౌన్‌లోడ్స్‌లో ఐదో స్థానం సాధించింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వడం, అన్ని సమావేశాలు వీడియోకాన్ఫరెన్స్‌లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వాటికి ప్రసిద్ధి చెందిన జూమ్‌ యాప్‌కు ఇటీవల డిమాండ్‌ పెరగడంతో డౌన్‌లోడ్‌లలో మొదటిస్థానం దక్కించుకుంది. అలాగే సోషల్‌మీడియా మాధ్యమాలైన టిక్‌టాక్‌ రెండో స్థానంలో, ఆ తర్వాత వరుసగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ ఉన్నాయి. కాగా, దేశవ్యాప్తంగా ఆరోగ్య సేతు యాప్‌ను ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 9.6 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈనెలలోనూ కలుపుకుంటే 11 కోట్లకు దగ్గరలో డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన యాప్‌ను ఇంతమంది డౌన్‌లోడ్‌ చేసుకోవడంపై అన్ని దేశాలు ఆసక్తిగా గమనించాయి. ఈ యాప్‌పై మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ కూడా ప్రశం‍సలు కురిపించిన విషయం తెలిసిందే. ఆరోగ్యానికి సంబంధించి మరో మొట్టు పైకి ఎక్కారని, కరోనా కట్టడిలో ఆరోగ్యసేతు యాప్‌ సేవలు ఎంతో బావున్నాయని పేర్కొన్నారు.

కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి ఆర్యోగ సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్తుల సమీపంలోకి వెళ్లినప్పుడు లేదా రెడ్‌ జోన్‌ ఏరియాలోకి ప్రవేశించినప్పుడు ఈ యాప్‌ హెచ్చరికలను జారీ చేస్తుంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని కేసులు, ఆరోగ్య సలహాలతో కూడిన సమాచారం ఉంటుంది. దీంతో భారీగా ఈ యాప్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఈ యాప్‌ పనితీరుకు మెచ్చి నెటిజన్లు 4.5 రేటింగ్‌లు ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ఏపీలోనూ కోవిడ్‌19 యాప్‌ సమర్థవంతంగా పనిచేస్తోంది. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రజల మనసులను గెలుచుకుంటోంది. చాలా మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇదే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి విషయాలు, తాజా సమాచారం ఈ యాప్‌ అందిస్తుంది.