ఆధార్‌ కార్డు ఇకపై ఏటీయం కార్డులా..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధార్‌ కార్డుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఏ పని కావాలన్నా ఆధార్‌ నంబరు ఎంటర్‌ చేయనిదే పూర్తి కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పదిలంగా దాచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం ప్లాస్టిక్‌ తరహా పేపర్‌పై ఆధార్‌కార్డు ముద్రించి ప్రభుత్వం అందజేస్తోంది. దీనికి భిన్నంగా మన ఏటీయం కార్డు మాదిరిగానే ఆధార్‌కార్డు కూడా ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఏటీయం కార్డు తరహాలోనే ఆధార్‌ను కూడా అందజేసేందుకు నిర్ణయించింది. ఇందు కోసం మనం రూ. 50లు చెల్లించాల్సి ఉంటుంది. పీవీసీ మెటీరియల్‌తో తయారైన ఈ కార్డు ఏటీయం కార్డు మాదిరిగానే మన్నుతుందనడంలో సందేహం లేదు. ఆన్‌లైన్‌లోని యూఐడీలు.జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి దీని కోసం దరకాస్తు చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్‌లో కోరిన వివరాలను అందజేసి, పేమెంట్‌ చేస్తే పది రోజుల్లో సదరు కార్డు మన అడ్రస్‌కు చేరుతుంది.

ఆధార్‌తో లింకైన మొబైల్‌ నంబర్, ఆధార్‌ కార్డు సంబంధిత పూర్తి వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నగదు చెల్లింపునకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఏదో ఒక ప్లాట్‌ఫాంను కూడా వినియోగించుకోవచ్చును.రూ. 50లు చెల్లించిన తరువాత రశీదును కూడా మొబైల్‌కు వస్తుంది. పూర్తి భద్రతతో కూడిన ఆధార్‌ కార్డు కావాలనుకునే వారు ఈ కార్డు కోసం దరకాస్తు చేసుకోవచ్చు.

Show comments