iDreamPost
android-app
ios-app

14 ఏళ్ళ వయసులో తప్పిపోయాడు.. 27 ఏళ్ళ తర్వాత తల్లిని కలిశాడు..

  • Published Jun 05, 2022 | 9:30 AM Updated Updated Jun 05, 2022 | 9:30 AM
14 ఏళ్ళ వయసులో తప్పిపోయాడు.. 27 ఏళ్ళ తర్వాత తల్లిని కలిశాడు..

నేపాల్‌కు చెందిన ఓ యువకుడు 14 ఏళ్ళ వయసులో ఢిల్లీలో తప్పిపోయి తాజాగా 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు. రవి అనే ఓ నేపాలీ యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం నేపాల్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు అక్కడ కూలి పనులు చేస్తూ ఉండగా ఒకరోజు అక్కడినుంచి రవి తప్పిపోయాడు. ఆ తర్వాత రవి కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతో వెతికారు. కానీ ప్రయోజనం లేకపోయింది.

అయితే రవి ఢిల్లీ నుంచి తప్పిపోయి నోయిడా అటవీ ప్రాంతంలోని కోట్‌ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ సమయంలో అతడి ఆరోగ్యం బాగోకపోవడంతో కోట్‌ గ్రామంలో ఉండే సంజయ్‌ అనే వ్యక్తి రవిని తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చాడు. అతని ఆరోగ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాడు. అప్పట్నుంచి దాదాపు 22 ఏళ్ల పాటు రవి అక్కడే కోట్ గ్రామంలోనే ఉన్నాడు.

అయితే కరోనాకి ముందు రవిని కొంతమంది ఎత్తుకెళ్లారు. దీంతో రవికి ఆశ్రయం కల్పించిన సంజయ్ పోలీసులకి ఫిర్యాదు చేయగా రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రవిని రెండున్నరేళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని బాఘ్‌పత్‌లో పోలీసులు గుర్తించి సంజయ్‌ కి అప్పచెప్పారు. ఈ క్రమంలో బాఘ్‌పత్‌కు చెందిన కొందరు రవిని నేపాల్ దేశానికి చెందినవాడిగా గుర్తించి నేపాల్‌ రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నేపాల్ అధికారులు దర్యాప్తు చేసి జరిగిన విషయాన్నంతా తెలుసుకొని రవిని అతడి కుటుంబసభ్యుల దగ్గరకు తీసుకెళ్లారు. 27 ఏళ్ల తర్వాత తన కుమారుడిని కలిసిన రవి తల్లి లక్ష్మి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసి కంటతడి పెట్టుకున్నారు. రవి కూడా తన తల్లిని చూడగానే గుర్తించి ఏడ్చేశాడు.