iDreamPost
android-app
ios-app

జోడి కుదిర్చిన మ్యూజికల్ హిట్స్ – Nostalgia

  • Published Apr 02, 2020 | 11:58 AM Updated Updated Apr 02, 2020 | 11:58 AM
జోడి కుదిర్చిన మ్యూజికల్ హిట్స్ – Nostalgia

హాస్య చిత్రాల్లో జంధ్యాల తర్వాత ఆ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న దర్శకులలో ఈవివి గారిది మొదటి వరస. ఆయన శిష్యుడిగా జంధ్యాల గారి బాటలోనే నడుస్తూ చిన్న హీరోలతో మొదలుకుని స్టార్ల దాకా ఎన్నో గొప్ప హిట్స్ అందించిన ఘనత ఈవివిది. సాధారణంగా కామెడీ సినిమాలలో పాటలకు అంతగా ప్రాధాన్యత ఉండదు. వీటి విషయంలో మ్యూజికల్ హిట్ అని వినడమే అరుదుగా ఉంటుంది. కాని ఈవివి ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చారు. ముఖ్యంగా రాజ్ కోటితో టై అప్ అయిన టైంలో వీళ్ళ కాంబినేషన్లో అద్భుతమైన హిట్లు ఎన్నో వచ్చాయి.

మొదటిసారి రాజ్ కోటి-ఈవివి కాంబోలో వచ్చిన సినిమా సీతారత్నం గారి అబ్బాయి. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో మంచి పాటలు ఉంటాయి. మత్తుగా గమ్మత్తుగా లాంటి మెలోడీ, పసివాడు ఏమిటో ఆ పైవాడు లాంటి పాథోస్ సాంగ్, నా మొగుడు బ్రహ్మచారి లాంటి టీజింగ్ పాట అన్ని కలగలసి మంచి ఆల్బంగా నిలబెట్టాయి. ఆ తర్వాత చేసిన ఏవండి ఆవిడ వచ్చిందిలో కూడా చక్కని పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇక నాగార్జున హీరోగా రూపొందిన హలో బ్రదర్ ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టో చెప్పాల్సిన పని లేదు. ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ చాలా రోజులు అభిమానులను వెంటాడింది. కన్నేపిట్టరో కన్ను కొట్టరో మాస్ ని చాలా కాలం వెంటాడింది.

కాని కొంత కాలం తర్వాత రాజ్ కోటి ద్వయం విడిపోయాక ఈవివితో కోటి ప్రయాణం సోలోగా సాగింది. ఆయనకు ఇద్దరు, మగరాయుడు, అల్లుడా మజాకా, తెలుగువీర లేవరా, చిలక్కొట్టుడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మా నాన్నకు పెళ్లి, మా విడాకులు, కన్యాదానం, పిల్ల నచ్చింది, చాలా బాగుంది, గొప్పింటి అల్లుడు, మా అల్లుడు వెరీ గుడ్డు దాకా ఇలా ఎన్నో సినిమాలతో ఈ జంట జర్నీ కొనసాగింది. వీటిలో అత్యధిక శాతం ఆడియో పరంగా మంచి మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నవే. దర్శకుడికి తనతో సింక్ అయితే పదే పదే టెక్నీషియన్స్ ని కోరుకుంటారు అనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో.