iDreamPost
android-app
ios-app

పఠాన్ విజయానికి 5 కారణాలు

  • Published Jan 30, 2023 | 3:17 PM Updated Updated Jan 30, 2023 | 3:17 PM
పఠాన్ విజయానికి 5 కారణాలు

నాలుగేళ్ల తర్వాత తెరమీద కనిపించిన షారుఖ్ ఖాన్ కు అంత నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కేసింది. పఠాన్ దూకుడు దేశంతో సంబంధం లేకుండా భీభత్సంగా సాగుతోంది. ఓవర్సీస్ లో కేవలం అయిదు రోజులకే 10 మిలియన్ మార్కుకి దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పటిదాకా ఏ బాలీవుడ్ మూవీకి సాధ్యపడలేదు. ఇటు వరల్డ్ వైడ్ గ్రాస్ సైతం 550 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ లెక్కలు కడుతోంది. ఖచ్చితమైన ఫిగర్లు ఇంకా బయటికి రానప్పటికీ కొంచెం అటుఇటుగా ఇవి రీచ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇవాళ సోమవారం నుంచి డ్రాప్ సహజమే అయినా ఏ సెంటర్లలో ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. దగ్గరలో కొత్త రిలీజులు లేవు కాబట్టి ఈ దూకుడు ఇప్పట్లో ఆగదు

ఇక పఠాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన అయిదు అంశాలేంటో చూద్దాం. మొదటిది షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఎంతసేపూ ఏదో రొమాంటిక్ గా కనిపించాలన్న తాపత్రయంలో గత పదేళ్లలో అతను చేసిన కథల ఎంపిక చేదు ఫలితాలను ఇచ్చింది. ఒక్క రయీస్ దానికి మినహాయింపు అయినా టేకింగ్ లోపాల వల్ల అదీ పెద్ద స్థాయికి చేరలేదు. రెండోది యాక్షన్ గ్రాండియర్ నెస్. ఏ మాత్రం నమ్మలేని విధంగా ఉండే ఫైట్లను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కంపోజ్ చేయించుకున్న తీరు పఠాన్ స్థాయిని పెంచింది. మూడోది జాన్ అబ్రహం విలనీ. ఎప్పుడో ధూమ్ లో చూసిన విలనిజం మళ్ళీ ఇందులో పర్ఫెక్ట్ గా పండించి చాలా పెద్ద ప్లస్ అయ్యాడు.

నాలుగోది అవసరం లేకుండా పాటలు పెట్టకపోవడం. ఎంత స్కోప్ ఉన్నా ఫ్లోకి అడ్డం వస్తాయని భావించిన సిద్దార్థ్ ఫస్ట్ హాఫ్ లో ఒక సాంగ్ కే పరిమితం చేయడం రెండోది ఎండ్ టైటిల్స్ కి కుదించడం బాగుంది. బోర్ తగ్గిపోయింది. అయిదోది సల్మాన్ ఖాన్ క్యామియో. ఉన్నది కాసేపే అయినా తన ఉనికిని బలంగా చాటుకునేలా తన టైమింగ్ తో ఫ్యాన్స్ కి మంచి విందు అందించాడు. ఇవన్నీ ఇలా బ్యాలన్స్ కాబట్టి కథతో పాటు కంటెంట్ ఎంత వీక్ గా ఉన్నా అన్నీ చెల్లిపోయాయి. ముఖ్యంగా మూడేళ్లుగా వందల కోట్లు తెచ్చే ఒక పెద్ద హీరో బ్లాక్ బస్టర్ లేని కరువుని ఎలాగైనా పఠాన్ రూపంలో తీర్చుకోవాలని కంకణం కట్టుకున్న ప్రేక్షకులు పఠాన్ ని ఎత్తులో నిలబెట్టేశారు.