iDreamPost
android-app
ios-app

యుపిలో ప్రభుత్వ వసతి గృహంలో కలకలం: 57 మందికి కరోనా, ఐదుగురికి గర్భం, ఒకరికి హెచ్‌ఐవి

యుపిలో ప్రభుత్వ వసతి గృహంలో కలకలం: 57 మందికి కరోనా, ఐదుగురికి గర్భం, ఒకరికి హెచ్‌ఐవి

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో (స్టేట్‌హౌం) ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడటం.. వారిలో ఐదుగురు గర్భంతో ఉండటం.. ఒకరికి హెచ్‌ఐవి పాజిటివ్‌ ఉన్నట్టు తెలియడం కలకలం రేపుతున్నది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల కాన్పూర్‌ జిల్లా వసతి గృహంలోని బాలికలకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలు కరోనా బారినపడ్డట్టు నిర్ధారణ అయింది.

ఇదే సమయంలో వసతి గృహంలోని ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్టు తెలియడం.. ఒకరికి హెచ్‌ఐవి పాజిటివ్‌ అని బయటపడటంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక్కడ మొత్తం 171 మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నట్టు సమాచారం. ఇక్కడ ఈ నెల 15న మొదటి పాజిటివ్‌ కేసు నమోదయిందనీ, రెండు రోజుల తర్వాత 33కు చేరిందని తెలిసింది.

వైరస్‌ వ్యాపిస్తూ… మరింత మంది కరోనా బారినపడుతున్నప్పటికీ కరోనా సోకినవారిని, మిగతా వారిని వేరు చేయకుండా అక్కడి అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. ఈ విషయం తెలిసిన మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని రాష్ట్ర బిజెపి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. ”రాష్ట్రంలో ఇలాంటి ఘటనలను విచారణకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నది. రాష్ట్రంలోని వసతి గృహాల్లో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిల్లో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ” అని అన్నారు.

ఈ ఘటనపై సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ.. కాన్పూర్‌ ఎస్సెస్పీ దినేశ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. షెల్టర్‌ హౌంలోని బాలికల్లో కొందరికి గర్భం రావడం, ఒకరికి హెచ్‌ఐవి పాజిటివ్‌, మరొకరికి హెపటైటిస్‌ సి ఉన్నట్టు వస్తున్న వార్తలపై విచారణ జరిపించాలని కోరారు.

కాగా, గర్భం దాల్చిన వారందరూ లైంగిక దాడి బాధితులనీ, వసతి గృహంలో చేరిన తర్వాత వారెవరూ గర్భం దాల్చలేదని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పూనం కపూర్‌ పేర్కొన్నారు. వసతి గహానికి రావడానికి ముందే బాలికలు లైంగిక దాడి బాధితులనీ, వారంతా అప్పటికే గర్భం దాల్చి ఉన్నట్టు కాన్పూర్‌ కలెక్టర్‌ బ్రహ్మదేవ్‌ రామ్‌ తివారీ కూడా చెప్పారు. కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించి, మిగతా వారిని క్వారంటైన్‌ చేసినట్టు చెప్పారు.

కాగా, రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఆగ్రాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ ఆగ్రాలో 75 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆగ్రాలోని ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీలో కరోనా చికిత్స కోసం చేరిన 28 మంది కరోనా బాధితులు.. ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే మృతిచెందారు. దీనిపై రాష్ట్ర సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 17,731కు చేరింది. మరణాల సంఖ్య 550కి పెరిగింది.