iDreamPost
android-app
ios-app

ఆప్‌ ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు.. కార్యకర్త మృతి

ఆప్‌ ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు.. కార్యకర్త మృతి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుని సంబరాలు చేసుకుంటున్న వేళ.. ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్యంగా జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఆప్‌ తరఫున మెహరోలి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే నరేశ్‌యాదవ్‌ ప్రయాణిస్తున్న వాహణ శ్రేణిపై గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తన సహచరులతో కలసి ఆలయానికి వెళ్లి పూజలు చేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పార్టీ కార్యకర్త అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

కాల్పులపై ఆమ్‌ ఆద్మీ పార్టీ çట్విట్టర్‌లో స్పందిస్తూ.. తమ ఎమ్మెల్యేపై జరిగిన కాల్పులలో ఒక కుటుంబసభ్యున్ని కోల్పోయామని పేర్కొంది. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపింది. ఈ విషయంపై ఎమ్మెల్యే నరేశ్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటన నిజంగా దురదృష్టకరం. ఈ దాడి వెనుక గల కారణాలు ఏమో నాకు తెలియదు. నా కాన్వాయ్‌లో నేనున్న వాహనంపైనే నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. పోలీసులు నిజాయతీగా విచారణ చేసి, తొందరలోనే నిందితులకు పట్టుకుంటారని ఆశిస్తున్నా. ఈ ఘటనలో పార్టీ వలంటీర్‌ అశోక్‌ మన్‌ మృతి చెందారు. మరో కార్యకర్త హరీందర్‌ గాయపడ్డారు’’ అని తెలిపారు.

అయితే ఎమ్మెల్యే లక్ష్యంగా కాల్పులు జరగలేదని, దుండగుల టార్గెట్‌ కేవలం అశోక్‌ మాత్రమేనని పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఓ క్రిమినల్‌ కేసులో అశోక్‌కు గల వ్యక్తిగత శత్రుత్వమే ఈ కాల్పులకు కారణమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు, ఈ కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ను పూర్తిగా విస్మరించారని ఆప్‌ మొదటి నుంచీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధి నుంచి ఢిల్లీ పోలీస్‌ వ్యవస్థను వేరు పరచాలని గతంలో చాలా సార్లు డిమాండ్‌ చేసింది.
కాగా, నరేశ్‌యాదవ్‌ ఈ ఎన్నికల్లో తన సమీప బీజీపీ అభ్యర్థి కుసుమ్‌ ఖాత్రిపై 18,161 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 2015 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి నరేశ్‌ 16,591 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మూడు సార్లు బీజేపీ అభ్యర్థులు, రెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.