iDreamPost
iDreamPost
(విక్టరీ వెంకటేష్ క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేమించుకుందాం రా 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే కాల యంత్రం నుంచి అప్పటి ఓ కుర్రాడి మనోగతం)
“అబ్బబ్బాబ్బా ఎప్పుడు మారుస్తావ్ రా ఈ డొక్కు సైకిల్. థియేటర్ కు వెళ్లే లోపు మూడు షోలు అయిపోతాయి. అయినా నిన్ను నమ్ముకుని వచ్చాను చూడు ముందు నా స్లిప్పర్ తో నన్ను కొట్టుకోవాలి”
రోడ్ రోలర్ కంటే తక్కువ స్పీడ్ తో మా విజ్జిగాడు వెళ్తుంటే వెనుక స్టాండ్ మీద కూర్చున్న నాకు అసహనం 101 టెంపరేచర్ లా అంతకంతా పెరుగుతోంది. దానికి తోడు వాడి ఎదవ డ్రైవింగ్ కి వెనకాల స్టాండ్ మీద కూర్చున్న నా బాడీలో ఎముకలన్నీ ఎన్నిసార్లు కదిలాయో లెక్క బెట్టుకోవడంతోనే టైం గడిచిపోతోంది.
1997వ సంవత్సరం….
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఒంటరిగా స్నేహితులతో సినిమాలు షికార్లు తిరగడం అప్పుడప్పుడే అలవాటవుతోంది. కొత్త బొమ్మ వచ్చిందని తెలిస్తే చాలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నా డోంట్ కేర్ లా తయారయ్యా. ఆ టైంలో వచ్చింది ప్రేమించుకుందాం రా. అభిమాన హీరో చిరంజీవే అయినా వెంకటేష్ అన్నా మనసులో ఓ సాఫ్ట్ కార్నర్. అందులోనూ బొబ్బిలిరాజా, చంటి లాంటి సినిమాల పుణ్యమాని ఫస్ట్ డే చూడాల్సిన లిస్ట్ లోకి చేరిపోయాడు.
అప్పుడప్పుడే మీసాలు మొలుస్తున్న వయసు. ప్రేమదేశం లాంటి మాస్టర్ పీసులు చూసి చూసి మనకూ ఏదయినా ఫిగర్ పడకపోదా అనే వెర్రి భ్రమలో గడుపుతున్న కాలం. ఇక కమాన్ లవ్ రా అని వెంకటేష్ పిలిస్తే మనసు ఊరుకుంటుందా. మా ఆదోనిలో అదే కొత్త హాలు. పేరు శ్రీనివాస A/C. కొంచెం దూరమే అయినా పెద్ద 70ఎంఎం స్క్రీన్ కావడంతో సెకండ్ థియేటర్ కు వెళ్లకుండా దీన్నే ఛాయిస్ గా పెట్టుకునే వాళ్ళం. అందులో వచ్చింది ప్రేమించుకుందాం రా. పైగా కర్నూల్ లో షూటింగ్ చేశారన్న వార్త ఏదో తెలియని ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఇస్తోంది. మొత్తానికి మా వాడు షో టైం ఇంకా పావుగంట ఉండగా ముక్కుతూ మూలుగుతూ గమ్యం చేర్చాడు. అప్పటికి అది నాలుగో రోజు అనుకుంటా.
వామ్మో అని ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. టికెట్ కౌంటర్ దగ్గర తొక్కిడి మాములుగా లేదు. ఆ రద్దీలోకి దూరి వెళ్తే బయటికి దేవతా వస్త్రాలతో రావడం ఖాయం. అప్పటికే ఇద్దరు ముగ్గరు ఫ్యామిలీ ప్యాక్ బాడీలతో చెమటలు తుడుచుకుంటూ బయటికి వచ్చారు. బ్లాకులో రేట్ చూస్తేనేమో నెల రోజుల స్కూల్ ఫీజులో సగం అడుగుతున్నారు. మా దగ్గరేమో సెకండ్ క్లాస్ టికెట్ డబ్బులు, పార్కింగ్ చిల్లర తప్ప పెద్దగా లేదు. నాకేమో ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు. ఏడుపొస్తోంది. నా బాధ చూడలేక ఏదైతే అదయ్యిందని విజ్జి గాడు గజినీ దండయాత్రను గుర్తుచేసుకుంటూ అందులోకి దూసుకుపోయాడు.
నాకేమో ఒకటే సస్పెన్స్. టికెట్లు దొరుకుతాయా లేదా. అలా పది నిమిషాలు గడిచాక చొక్కా జేబుని చింపుకుని ఫైనల్ గా మా సీమబిడ్డ టికెట్లతో బయటపడ్డాడు. కత్తి లేదు కానీ లేదంటే రక్తంతో తిలకం పెట్టేసేవాడిని. అప్పటికే కొంపల్లో టేప్ రికార్డర్లలో పాటలు విని విని చెవులు హోరెత్తిపోవడంతో వాటినే పాడుకుంటూ లోపలికి అడుగుపెట్టాం. అక్కడిదాకా ఒక ఎత్తు, ఎవడికి వాడు తాతల ఆస్తిలా పట్టుకున్న సీట్ల మధ్య కూర్చోవడం ఇంకో ఎత్తు. ఏదోలా ఆ కార్యం కూడా ఘనంగా ముగించేసి సినిమా మొదలుకాబోయే బృహత్తర క్షణం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాం. రానే వచ్చింది.
సాఫీగా సాగిపోతోంది. కాలేజీ స్టూడెంట్ గా వెంకీ ఎంత బాగున్నాడో. డిగ్రీకు వచ్చాక నేను కూడా అలాగే ఉంటానన్న ఫీలింగ్ మనసులో. సరే మనోడు కొత్త కాదు కానీ హీరోయిన్ అంజలా ఝావేరి కోసం వెయిటింగ్. వచ్చేసింది. ఆహా ఎంత నచ్చిందో. అసలు మా కర్నూల్ లో ఇంత అందమైన అమ్మాయిలు లేరే, మరి డైరెక్టర్ ఏంటి ఇలా చూపించాడని నేను మా వాడు ఒకటే చెవులు కొరుక్కోవడం. లవ్ ట్రాక్ ని బాగానే ఎంజాయ్ చేశాం కానీ వీరభద్రయ్యగా జయప్రకాష్ రెడ్డి ఎంత భయపెట్టాడో శివుడిగా శ్రీహరి అంతకు రెట్టింపు దడని పుట్టించాడు. ఇద్దరూ అలా జీవించేశారు. పాటలు కంపోజ్ చేసిన మహేష్ చాలా చిన్న వయసులోనే చనిపోవడం, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని తెలుసుకోవడం ప్రేమించుకుందాం రాకు సంబంధించి నేను తెలుసుకున్న చేదు, తీపి నిజాలు.
కావాల్సినంత కామెడీ, కిరాక్ అనిపించే పాటలు, ఫ్రెష్ బ్యూటీ అంజలా అందం, వెంకీ టైమింగ్, బోర్ కొట్టకుండా సాగిన జయంత్ టేకింగ్ వెరసి మా టికెట్ సొమ్ముకు, అంత కష్టపడి వచ్చిన దూరానికి పూర్తి న్యాయం చేకూర్చింది ప్రేమించుకుందాం రా. మనకూ కావేరి లాంటి పిల్ల దొరకాలని బయటికి వస్తున్నప్పుడే మొక్కేసుకున్నా. కాకపోతే ఇలాంటి ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి మాత్రం వద్దనే కండీషన్ తో. ఆ టైంలో దేవుడు పడుకున్నాడు కాబోలు నా విన్నపం ఆయనకు చేరలేదు, ఏ అంజలా ఝవేరి నన్ను ప్రేమించలేదు. నేను మాత్రం వెంకీ గిరిలా ట్రైల్స్ వేసి వేసి రెండేళ్ల ఇంటర్ ని మూడేళ్ళలో వేగంగా పూర్తి చేసి డిగ్రీలో పడ్డాను. అప్పటికే వెంకటేష్ పెళ్లి చేసుకుందాంతో వచ్చేసాడు కానీ నా సోలో లైఫ్ లో ప్రేమించుకుందాం రా అనే భామే దొరకలేదు. కానీ కొన్నేళ్ల పాటు మా కాలేజీ కుర్రాళ్ళు లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించడం బ్రిటానియా కంపెనీ మర్చిపోకూడదు.
నా విషయం పక్కనపెడితే నా స్టూడెంట్ లైఫ్ లో ప్రేమించుకుందాం రా ఓ అందమైన జ్ఞాపకం. తర్వాత కూడా అదే హాల్ లో ఇంకో రెండు సార్లు చూస్తే కానీ తనివి తీరలేదు. సక్సెస్ టూర్ కోసం వెంకటేష్ ఆదోని వచ్చినప్పుడు కాలేజీలో మార్నింగ్ సెషన్ బంకు కొట్టి బ్యాచు మొత్తం అక్కడికి వాలిపోయాం. దూరం నుంచి వెంకీ తన సిగ్నేచర్ స్టైల్ లో విష్ చేస్తే అదేదో మాకే పర్సనల్ గా చేశాడన్నంత సంబరంతో మళ్ళీ రిటర్బ్ వెళ్ళిపోయి ప్రిన్సిపల్ తో ఎన్ని తిట్లు తిన్నామో. అందుకే ఇన్నేళ్లు గడుస్తున్నా ప్రేమించుకుందాం రా జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ తాజాగా ఉంటాయి. టీవీలో వచ్చిన ప్రతిసారి రిమోట్ పక్కనపారేసి అలా చూస్తూ ఉండిపోవడమే. గిరి, కావేరిలకు మరొక్కసారి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటూ సెలవు…