2019 – తెలుగు సినిమా తీరుతెన్ను

టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలు అంతకు మించి ఎన్నో పాఠాలు నేర్పించిన 2019 సెలవు తీసుకొంటోంది. సరికొత్త ప్రతిభకు స్వాగతం చెబుతూ 2020 ఏవేవో ఆశలు మోసుకుని వస్తోంది. నానాటికి విజయాల శాతం తగ్గుతూ ఉండటం పట్ల ఇప్పటికే పరిశ్రమ పెద్దలు ఆందోళన చెందుతున్నప్పటికీ యువతరం దర్శకులు నవ్యతతో కూడిన ఆలోచనలతో తక్కువ బడ్జెట్ ప్రయత్నాలతో ఆకట్టుకోవడం శుభ పరిణామంగా కనిపిస్తోంది. డిజిటల్ ప్రభావం వల్ల థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో గత ఏడాది తెలుగు సినిమాల జయాపజయాలపై ఓ విశ్లేషణ

కాసుల మూటలు ఈ సినిమాలు

సంక్రాంతిని చాలా కీలకంగా భావించే స్టార్లు ఈసారి కూడా పోటాపోటీగా నువ్వా నేనా అంటూ పందెం కోళ్లుగా బరిలో దిగారు. కానీ అనూహ్యంగా విక్టరీ వెంకటేష్ ఎఫ్2 అగ్ర సింహాసనం దక్కించుకుంది. 70 కోట్లకు పైగా షేర్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సంవత్సరం టాప్ హిట్ గా నిలిచి వెంకీని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. భార్యాభర్తల మధ్య బంధాన్ని హాస్యభరితంగా అనిల్ రావిపూడి డీల్ చేసిన తీరు ప్రేక్షకుల నుంచి నవ్వులతో పాటు డబ్బులు కూడా తెచ్చింది. ఇక మహర్షి సైతం భారీ బడ్జెట్ తో రూపొంది మరో బ్లాక్ బస్టర్ ని మహేష్ బాబు ఖాతాలో వేసింది. రైతుల సమస్యను తీసుకుని కమర్షియల్ హంగులను జోడించి వంశీ పైడిపల్లి తీర్చిదిద్దిన తీరుకు 90 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చి పడ్డాయి.

చిరంజీవి సైరా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్కును అందుకున్నప్పటికీ ఇతర భాషల్లో మాత్రం ఫెయిల్ ముద్ర వేయించుకుంది. సమంతా కీలక పాత్రలో రూపొందిన ఓ బేబీ డీసెంట్ హిట్ గా నిలిచి తన కెరీర్ బెస్ట్ గా మారింది. భార్యాభర్తలు నాగచైతన్య సామ్ లు కలిసి నటించిన మజిలీ 35 కోట్ల దాకా షేర్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక తక్కువ బడ్జెట్ లో రూపొందిన బ్రోచేవారెవరురా సర్ ప్రైజ్ హిట్ గా నిర్మాతలకు లాభాలు ఇచ్చింది. నాని జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మరీ గొప్పగా అద్భుతాలు చేయలేకపోయింది. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ విజయం మారుతున్న అభిరుచులకు అద్దం పట్టింది.

ఇక రామ్ పూరిల కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సాలిడ్ అండ్ స్మాషింగ్ హిట్ గా చెప్పుకోవచ్చు. తొలుత డివైడ్ టాక్ వచ్చినప్పటికీ దాన్ని తట్టుకుని మరీ మాస్ ప్రేక్షకుల అండతో పూరి బ్రాండ్ కి జీవం పోసింది. సాయి ధరమ్ తేజ్ కు చిత్రలహరి కళ్యాణ్ రామ్ కు 118కు మంచి పేరు ఇచ్చి రేస్ లో నిలబెట్టాయి. వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ సంతృప్తి పరిచే ఫలితాన్నే ఇచ్చింది. ఊహించని స్థాయిలో ఏడాది చివర్లో ప్రతి రోజు పండగే పెద్ద హిట్ గా నిలిచి మూడో వారంలో సైతం స్ట్రాంగ్ గా నిలవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. పెద్దగా ఖర్చు లేకుండా రూపొందిన కొబ్బరిమట్టను కూడా హిట్ లిస్ట్ లో వేయొచ్చు. బూతులున్న చీకటి గదిలో చితకొట్టుడు బయ్యర్లకు ప్రాఫిటబుల్ వెంచర్ గా ఆశ్చర్యపరిచింది. ఫినిషింగ్ టచ్ గా కీరవాణి వారసులు చేసిన “మత్తు వదలరా” హిట్ దిశగా దూసుకుపోతోంది

ఏదో తేడా………అయినా పాసయ్యాయి

టాక్ కొంత బాగున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేక యావరేజ్ గా మిగిలిన సినిమాలు నష్టాలు తేకుండా ప్రొడ్యూసర్లను నిరాశపరచకుండా అంతో ఇంతో కాసులు కురిపించాయి. స్వర్గీయ వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన యాత్ర డీసెంట్ టాక్ తో చక్కని రన్ అందుకుంది. మలయాళం ఆంగ్లమేలి డైరీస్ కి రీమేక్ గా రూపొందిన ఫలక్ నుమాదాస్ హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ కు మంచి బూస్ట్ గా పనికొచ్చింది. మామ అల్లుళ్ళ క్రేజీ కాంబోలో రూపొందిన వెంకీ మామ కథను చెప్పడంలో దర్శకుడు బాబీ పడ్డ తడబాటు వల్ల ఆశించిన స్థాయిని అందుకోలేక ఈ క్యాటగిరీలో సర్దుకోవాల్సి వచ్చింది.

నాలుగు వందల కోట్ల పేరుతో ఎంతో హంగామా చేసిన సాహో చెప్పుకోవడానికి భారీ ఫిగర్స్ ని నమోదు చేసింది కానీ జరిగిన బిజినెస్ కి వచ్చిన లెక్కకు పొంతన లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు. అడవి శేష్ ఎవరు కంటెంట్ పరంగా అది టార్గెట్ చేసిన ఆడియన్స్ అంచనాలను అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు రాక్షసుడు మొదటి సక్సెస్ ఫుల్ మూవీగా ట్రేడ్ మాట్లాడుకుంది. తాప్సీ పన్ను గేమ్ ఓవర్ మల్టీ ప్లెక్సుల్లో బాగా ఆడింది. కౌసల్య కృష్ణమూర్తి ఓసారి చూడొచ్చు అనే టాక్ తో గట్టెక్కింది

పని చేయని కాంట్రవర్సిలు

కేవలం వివాదాలతో తన సినిమాలు పబ్లిసిటీ చేసుకునే రామ్ గోపాల్ ఈసారి వేసిన రెండు ఎత్తుగడలు అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. అలనాటి వైస్రాయ్ ఎపిసోడ్ ని ఆధారంగా చేసుకుని రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రారంభంలో బాగానే హైప్ తెచ్చుకున్నప్పటికీ కంటెంట్ మరీ తీసికట్టుగా ఉండటంతో రెండో వారానికే టపా కట్టాల్సి వచ్చింది. కోర్టు, సెన్సార్ బోర్డు చుట్టూ తిరిగిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సైతం అంతకన్నా దారుణంగా సాయంత్రం ఆటకే డిజాస్టర్ టాక్ మొత్తగట్టుకుంది. ప్రేక్షకులను అమాయకులుగా జమకట్టు వర్మ చేస్తున్న ట్రిక్కులు కనీస స్థాయిలో పనిచేయలేదు. వీటిని మరిచిపోకముందే కొత్త ఏడాది మొదటి రోజే బ్యూటిఫుల్ అని మరో కళాఖండంతో వస్తున్నాడు. అది ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి

డబ్బింగుల హవా తక్కువే

ఒకప్పుడు సూర్య, విశాల్, కార్తీ లాంటి ఆరవ సినిమాల డబ్బింగ్ మార్కెట్ కు బంగారు బాతులా ఉన్న తెలుగు బాక్స్ ఆఫీస్ లో గత కొనేళ్లుగా పెద్దగా మెరుపులు లేవు. అందుకే హక్కులు కొనే విషయంలో నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఉన్నంతలో తెలుగు సినిమాల పోటీ లేని దీపావళిని టార్గెట్ చేసుకుని వచ్చిన విజిల్ పెట్టిన పెట్టుబడి సేఫ్ గా వెనక్కివ్వగా ఊహించని రీతిలో ఖైదీ కార్తీ కెరీర్లో సూపర్ కలెక్షన్స్ చూపించింది. కానీ అన్న సూర్య మాత్రం NGK, బందోబస్తుతో దారుణంగా నిరాశపరిచాడు. వీటిని తలుచుకుంటే నిద్రలో సైతం భయపడేంత ఘోరంగా ఇవి ఫెయిల్ అయ్యాయి.

విశాల్ యాక్షన్ తో ఆ జానర్ లవర్స్ ని ఆకట్టుకున్నాడు కానీ అభిమన్యుడు రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ప్రభుదేవా అభినేత్రి 2 హాల్ లో నుంచి జనాన్ని తరిమినంత పని చేసింది. ఇంకా చాలానే ఉన్నాయి కానీ ఓ రెండు తప్ప డబ్బింగ్ సినిమాల ప్రభావం శూన్యమే. ఒక్క ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మాత్రం మతులు పోయే స్థాయిలో ఇక్కడ డబ్బు మూటలు కట్టుకుని హాలీవుడ్ నిర్మాతలకు పార్సెల్ చేసింది. లారెన్స్ కాంచన 3 బిసి సెంటర్స్ లో ఆడింది. మోహన్ లాల్ లూసిఫర్ ని పట్టించుకున్న నాథుడు లేడు. అల్లు అరవింద్ లాంటి పెద్ద అండగా ఉన్నా మమ్ముట్టి మామంగం ప్రభావం సున్నానే. ఉన్నంతలో హృతిక్ రోషన్ వార్ బాగా ఆడింది. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 రొటీన్ కథతో మనవాళ్లను ఆకట్టుకోలేకపోయింది.

ఇవి మాములు డిజాస్టర్ లు కావు

2019 స్టార్ హీరోలు కొందరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది బాలకృష్ణ గురించి. ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు, రూలర్ మూడు కలిపి సుమారు 90 కోట్ల దాకా బిజినెస్ చేయగా ఫైనల్ గా పాతిక కోట్లు కూడా వసూలు చేయలేక అభిమానులకు ఎన్నడూ మర్చిపోని పీడకలలు మిగిల్చింది. తన స్టేచర్ మర్చిపోయి రొమాన్స్ పేరుతో నాగార్జున ప్రయత్నించిన మన్మథుడు 2 ఫ్యామిలీ ఆడియన్స్ సైతం దుమ్మెత్తి పోసేలా ఫలితమిచ్చింది. రామ్ చరణ్ వినయ విధేయ రామ డిజాస్టర్లకు బోణీ కొట్టింది. అర్థం లేని హీరోయిజంని ప్రేక్షకులు ఏ మాత్రం భరించలేరని తీర్పు చెప్పి ఏకంగా హీరోగా ప్రెస్ నోట్ రూపంలో సారీ చెప్పిందేదాకా వదల్లేదు.

రజనీకాంత్ పేట సైతం సంక్రాంతి రేస్ లో కుదేలైపోయి బ్రేక్ ఈవెన్ కే నానా తంటాలు పడింది. అఖిల్ మిస్టర్ మజ్ను మరోసారి అక్కినేని అభిమానులను నిరాశ మిగిల్చింది. విభిన్న ప్రయోగాలు చేస్తాడని పేరున్న శ్రీవిష్ణుకు తిప్పరా మీసం ఆనందాన్ని ఆవిరి చేసింది. మరాఠి సైరాత్ కు తెలంగాణ కోటింగ్ ఇచ్చి ట్రై చేసిన దొరసాని కూడా ఆకట్టుకోలేదు. ఆరెక్స్ 100 హీరో కార్తికేయకు ఈ ఏడాది అసలు కలిసి రాలేదు. గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ ఒకే ఫలితాన్ని అందుకున్నాయి.

ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న డియర్ కామ్రేడ్ సైతం విపరీతమైన హైప్ ని అందుకోలేక నెగటివ్ రిజల్ట్ ని అందుకుని హీరోకు ఫ్యూచర్ వార్నింగ్ గా నిలిచింది. రాజశేఖర్ కల్కి బడ్జెట్ ను వెనక్కు ఇవ్వలేకపోయింది. శర్వానంద్ గంపెడాశలు పెట్టుకున్న రణరంగం యుద్ధం చేయలేక అస్త్ర సన్యాసం చేసింది. నాని గ్యాంగ్ లీడర్ మొదట్లో పర్వాలేదు అనే టాక్ తెచ్చుకున్నా చివరికి యావరేజ్ కూడా అనిపించుకోలేక చేతులెత్తేసింది. గోపి చాంద్ చాణక్య, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే వీక్ ఓపెనింగ్స్ తో పాటు బ్యాడ్ టాక్ తో టపా కట్టేశాయి

అడ్రెస్ లేని కథానాయకులు

ఇదిలా ఉండగా ఈ సంవత్సరం అసలు సినిమానే రాని హీరోలు కూడా ఉన్నారు. తన ఫ్యాన్స్ కు నిరాశ మిగులుస్తూ జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో బిజీగా మారిపోయి ఇంకే విడుదల లేకుండా 2019 మిస్ అయ్యాడు. స్టైలిష్ స్టార్ట్ అల్లు అర్జున్ నా పేరు సూర్య దెబ్బకు ఆత్మపరిశీలనలో పడిపోయి తనూ ఈ సంవత్సరం ఫ్యాన్స్ కి సినిమా ఇవ్వకుండా వదులుకున్నాడు. నితిన్ ఇదే తరహాలో గత పరాజయాలను బేరీజు వేసుకుంటూ తడబడటంతో అభిమానులకు మూవీ గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు. వీళ్లంతా మంచి మార్కెట్ ఉన్న స్టార్లే అయినప్పటికి కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తల వల్ల విలువైన ఏడాది కాలాన్ని మిస్ చేసుకున్నారు. అందుకే 2020 ఫస్ట్ హాఫ్ లోనే తన సినిమాలను క్యూలో పెట్టేసి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు

కంటెంట్ బాగుంది అయినా

కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నవి 2019లో ఉన్నాయి. మల్లేశం అందులో ప్రధానమైనది. చేనేత నేత చింతకింది మల్లేశం బయోపిక్ గా రూపొందిన ఈ సినిమాను ఓ వర్గం ప్రేక్షకులు మెచ్చుకున్నా కథనంలో వేగం లేకపోవడంతో అందరిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. గ్రామీణ నేపధ్యాన్ని తీసుకున్న రాజావారు రాణిగారు సైతం ప్రీ టాక్ పాజిటివ్ గా తెచ్చుకుని రిలీజ్ అయ్యాక మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. విజయ్ ఆంటోనీ కిల్లర్, అమలా పాల్ ఆమె, సీనియర్ నరేష్ రఘుపతి వెంకయ్య నాయుడు, జార్జ్ రెడ్డి కంటెంట్ పరంగా ఇంప్రెషన్ తెచ్చుకున్నా ఫైనల్ గా మాత్రం అంతంత మాత్రం ఫలితాలనే అందుకున్నాయి.

చివరి మాట

2019లో విడుదలైన సినిమాల సంఖ్య అందుకున్న విజయాల శాతం నిష్పత్తిలో చూసుకుంటే సక్సెస్ కేవలం 15 శాతం మాత్రమే ఉండటం తీవ్రంగా విశ్లేషించుకోవాల్సిన అంశం. డిజిటల్ హక్కుల ఆదాయం మాయలో పడి దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ ల మీద పూర్తి స్థాయి శ్రద్ధ వహించడం లేదన్న కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో నానాటికి పెను సవాల్ గా మారుతున్న థియేటర్ల నిర్వహణను సజీవంగా నిలపాలంటే ఆకట్టుకునే సినిమాలు క్రమం తప్పకుండా రావాలి. ప్రతి సంవత్సరం ఈ పాఠం పరిశ్రమ నేర్చుకుంటున్నా ఆచరణలో మాత్రం దాన్ని పూర్తిగా పాటించడం లేదు. ఒకపక్క వెబ్ సిరీస్ లు మరోపక్క కొత్త సినిమాలను రెండు నెలలు తిరక్కుండానే ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న స్ట్రీమింగ్ సైట్ల పోకడలు తట్టుకుని నిలవాలి అంటే తప్పులు జరక్కుండా ప్రేక్షకులను రంజింపజేసే కథలపై దృష్టి సారిస్తే టాలీవుడ్ భవిష్యత్తుకు ఏ ఢోకా ఉండదు

Show comments