iDreamPost
iDreamPost
కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోతాయి. కొన్ని అన్ని పూర్తయ్యాక సెన్సార్ తెచ్చుకున్నాక ల్యాబుల్లో మగ్గిపోతాయి. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పేరున్న హీరో, ఇండస్ట్రీలో బ్రాండ్ ఉన్న రచయిత దర్శకుడిగా మారిన సినిమా 13 ఏళ్ళు రిలీజ్ కాకుండా ఆగిపోవడం విచిత్రమేగా. ఇప్పుడు దానికి విముక్తి కలిగింది. ప్రముఖ రచయిత కం నిర్మాత కోన వెంకట్ డైరెక్టర్ గా డెబ్యు చేస్తూ 2007లో తమిళ్ లో తీసిన సినిమా ‘నాన్ అవల్ అదు’.
తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ అప్పుడే జరిగింది. మాధవన్ హీరో. ఆ టైంలో మంచి క్రేజ్ లో ఉన్నాడు. హీరొయిన్లుగా జయం ఫేం సదా, షమితా శెట్టి నటించారు. కాని ఏవేవో కారణాల వల్ల సినిమా పూర్తైనా విడుదలకు నోచుకోలేదు. దీనికి మరో విశేషం ఉంది. ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. జీవి ప్రకాష్, ఆర్పి పట్నాయక్, ధరన్, ప్రసన్న పాటలు కంపోజ్ చేశారు. ఎందుకో మరి ఇంత చేసినా అది బయటికి రాలేకపోయింది. త్వరలో దీనికి మోక్షం కలగనుంది. థియేట్రికల్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ అదే టైంలో వచ్చిన ‘డార్లింగ్’ అనే హింది సినిమాకు రీమేక్.
ఆల్రెడీ పెళ్ళైన హీరో తన సెక్రటరీతో ఘాడమైన ప్రేమలో పడతాడు. తను గర్భవతి అవుతుంది. అనుకోకుండా హీరో వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది. దీంతో దెయ్యంగా మారి అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది. హిందిలో ఫర్దీన్ ఖాన్ నటించాడు. అసలు ట్విస్ట్ ఇంకొకటి ఉంది. దీనికి హిందిలో దర్శకత్వం వహించింది రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆ కథ నచ్చి కోన వెంకట్ సౌత్ లో రీమేక్ కు రెడీ అయ్యాడు. మరి ఇంత గ్యాప్ తర్వాత రిలీజ్ ఆగిపోయిన సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. అసలే కరోనా వల్ల పెద్ద పెద్ద క్రేజీ సినిమాలే విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని బయటికి తీసుకురావడం సాహసమే.