iDreamPost
android-app
ios-app

ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేతిలో టీమిండియా దిగ్భ్రాంతికర ఓటమికి 21 ఏళ్లు

ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేతిలో టీమిండియా దిగ్భ్రాంతికర ఓటమికి 21 ఏళ్లు

1999 మే 19 వ తేదీని తమకు అవకాశం వస్తే చరిత్ర పుటలోంచి తొలగించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటాడు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఐసీసీ ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో పసికూన జింబాబ్వే చేతిలో భారత్ భంగపాటుకు గురైనది. పైగా వన్డేలలో ఎక్స్‌ట్రాల రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండవ జట్టుగా భారత్ నిలిచి ఒక అవాంఛనీయ రికార్డును తన పేరిట నెలకొల్పింది.

లీసెస్టర్‌లో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ 8వ లీగ్ మ్యాచ్‌లో టాప్ నెగ్గిన భారత్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఓపెనర్ గ్రాంట్ ఫ్లవర్ 45 పరుగులు చెయ్యగా,అతని సోదరుడు ఆండీ ఫ్లవర్ అజేయంగా 68 పరుగులు చేశాడు. ఫ్లవర్ సోదరుల బ్యాటింగ్‌లో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్‌లలో జింబాబ్వే 9 వికెట్‌లకు 252 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 14 లెగ్-బైలు,16 నో-బాల్స్ మరియు 21 వైడ్ లతో కలిపి మొత్తం 51 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకుంది. ఈ ఎక్స్‌ట్రా పరుగులే జింబాబ్వే ఇన్నింగ్స్‌లో రెండవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

బౌలర్‌ల స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ రిఫరీ భారత ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్‌లు కోత విధించారు.దీంతో 46 ఓవర్‌లలో 253 పరుగుల లక్ష్య ఛేదన మొదలెట్టిన భారత ఓపెనర్ సదా గోప్పన్ రమేష్ (55)తో పాటు మిడిల్ ఆర్డర్‌లో అజయ్ జడేజా (43) రాణించారు.అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, మహమ్మద్ అజారుద్దీన్ పెద్దగా పరుగులు సాధించలేదు. భారత ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసిన వికెట్ కీపర్ నయాన్ మోంగియా 41 ఓవర్‌లో ఏడో వికెట్‌గా జట్టు స్కోరు 219 వద్ద వెనుదిరిగాడు.ఈ దశలో రాబిన్ సింగ్, జవగళ్ శ్రీనాథ్ తో కలిపి పోరాటం చేస్తూ భారత్‌ను గెలుపు అంచుల దాకా తీసుకు వచ్చాడు.

హెన్రీ ఒలోంగా సూపర్ మ్యాజిక్ ఓవర్:

విజయానికి 12 బంతులలో 9 పరుగులు అవసరం కాగా మూడు వికెట్లు భారత చేతిలో ఉన్నాయి. కెప్టెన్ కాంబెల్ 45 ఓవర్ బౌలింగ్ చెయ్యటానికి బంతిని హెన్రీ ఒలోంగా చేతికి ఇచ్చి నిట్టూర్చాడు.45వ ఓవర్ మొదటి బంతిని రాబిన్ సింగ్ కవర్స్ దిశలో ఛీప్ చేసి రెండు పరుగులు దొంగలించాడు. రెండో బంతి బ్యాట్ హెడ్జ్ తీసుకుని షార్ట్ కవర్ దిశలో గాలిలోకి లేయ్యగా కెప్టెన్ పట్టిన అద్భుత క్యాచ్‌తో 35 పరుగులు సాధించిన రాబిన్ సింగ్ పెవిలియన్ చేరాడు.అనిల్ కుంబ్లే మూడో బంతిని గల్లీకి తరలించి ఒక్క పరుగు సాధించాడు.

నాలుగో బంతిని ఎదుర్కొన్న శ్రీనాథ్ బ్యాక్ వార్డ్ దిశలో ఆడగా గ్రాంట్ ఫ్లవర్ విసిరిన ఓవర్ త్రో వలన రెండు పరుగులు వచ్చాయి. ఐదో బంతిని నేరుగా వికెట్ల పైకి సంధించిన ఒలోంగా ఫలితం రాబట్టాడు.12 బంతులలో 2 సిక్స్‌లతో 18 పరుగులు చేసిన శ్రీనాథ్ వెనుదిరిగే సమయానికి భారత గెలుపుకు 7 బంతులలో 4 పరుగులు కావాలి.జింబాబ్వే పేసర్ ఇన్నింగ్స్‌లో తన చివరి బంతికి వికెట్ల ముందు వెంకటేష్ ప్రసాద్ ను దొరకబుచ్చుకొని అసాధ్యం అనుకున్న విజయాన్ని జింబాబ్వే సొంతం చేశాడు.

ఫలితంగా భారత్ విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది.అయితేజింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు తన తండ్రి మరణం కారణంగా టెండూల్కర్ భారతదేశానికి వెళ్ళాడు.ఈ మ్యాచ్‌లో సచిన్ సేవలు దూరం కావటం వల్లనే భారత్ ఓడిపోయిందని అభిమానులు ఇప్పటికీ భావిస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.