iDreamPost
iDreamPost
సంవత్సరం పొడవునా ఎన్ని సీజన్లు ఉన్నా, సుదీర్ఘమైన వేసవి సెలవులు వచ్చినా సంక్రాంతి పండగ వచ్చే జనవరి మాత్రం టాలీవుడ్ కు ఎప్పటికీ స్పెషలే. వసూళ్ల పరంగా ఆదరణ పరంగా అప్పుడు దక్కినంత ఘనస్వాగతం సినిమాలకు ఇంకెప్పుడు రాదన్నది కూడా వాస్తవం. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. అలాంటిదే 1996. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళొద్దాం. ఆ సంవత్సరం పండక్కు మూడు చిత్రాలు పోటీ పడ్డాయి. ముందుగా వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ ‘సంప్రదాయం’. నెంబర్ వన్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా మీద అభిమానులకు భారీ అంచనాలుండేవి.
జనవరి 11న విడుదలైన సంప్రదాయంలో క్యాస్టింగ్, పాటలు అన్నీ కుదిరినట్టే అనిపించినా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. 13న వచ్చిన వెంకటేష్ ‘ధర్మచక్రం’కు ఓపెనింగ్స్ బాగా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ సురేష్ బ్యానర్ ఆశించిన రేంజ్ కు వెళ్లలేకపోయింది. వీటి మధ్య 12న రిలీజైన ‘పెళ్లి సందడి’ పైన రెండు స్టార్లను ధీటుగా ఎదురుకుని ఏకంగా ఇండస్ట్రీ హిట్ సాధించింది. పోటెత్తిన జనంతో థియేటర్లు కళకళలాడాయి. ఆడియో క్యాసెట్స్ అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. చిన్న చిన్న కేంద్రాల్లోనూ పెళ్లి సందడి సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం.
కృష్ణ, వెంకటేష్ లను ఓవర్ టేక్ చేసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ విజేతగా నిలిచారు. ఇక అదే నెల ట్రెండ్ ని గమనిస్తే జనవరి 5న ఒకే రోజు బాలకృష్ణ వంశానికొక్కడు, నాగార్జున వజ్రం రిలీజ్ కాగా బాలయ్య విన్నర్ అయ్యారు. ముందు సంక్రాంతికి అనుకున్న మోహన్ బాబు ‘సోగ్గాడి పెళ్ళాం’ వాయిదా పడి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. 26న రాజేంద్ర ప్రసాద్ ‘మమ్మీ మీ ఆయనొచ్చాడు’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. డబ్బింగ్ సినిమాలు రౌడీ నాయకుడు, పోలీస్ ఎంక్వయిరీ సోసోగానే ఆడాయి. ఇలా ఒక చిన్న నటుడు స్టార్ గా ఎదగడానికి దోహదం చేసిన 96 సంక్రాంతి చాలా స్పెషల్
Also Read : Amma Rajeenama : కంటతడి కనువిప్పు రెండూ కలిగించిన సినిమా – Nostalgia