iDreamPost
iDreamPost
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో తయారయ్యే ఆర్టోస్ కూల్ డ్రింక్ పరిశ్రమది 102 ఏళ్ల ప్రస్థానం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ సైనికులు పాపులర్ చేయడంతో నిలదొక్కుకొని ఇన్నేళ్లూ జనానికి రుచులు అందిస్తోంది. ఈ పరిశమ్ర చరిత్ర ఆసక్తికరం.
1912లో రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టరేట్‌లో వృథాగా పడిఉన్న సోడా తయారు చేసే మెషీన్‌ను ఒకటి తెచ్చుకున్నారు. అయితే దాన్ని ఎలా వాడాలో ఆయనకు అర్ధం కాలేదు. విశాఖపట్నం పోర్టుకు తీసుకెళ్లి అక్కడి ఒక బ్రిటిష్ ఉద్యోగి సాయంతో మెషీన్‌కు కొన్ని మరమ్మతులు చేయించి దాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకున్నారు. తర్వాత రామచంద్రపురం వచ్చి నీళ్ల సీసాలో గ్యాస్ నింపి సోడాగా తయారు చేసి వ్యాపారం ప్రారంభించారు.
అయితే గోళీ సోడా ద్వారా బయటకు వస్తున్న గ్యాస్‌ను చూసి అందులో భూతం ఉందని, ఎవరూ తాగకూడదని జనం నిర్ణయించుకున్నారు. దీంతో పెద్దగా అమ్మకాలు సాగేవి కావు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైనికులు దీన్ని బాగా ఇష్టంగా తాగేవారు. అది చూసిన తరువాత స్థానికులు కూడా దీన్ని క్రమంగా ఆదరించారు.
1919లో అధికారికంగా..
రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు, అడ్డూరి జగన్నాథరాజు 1919లో అధికారికంగా ఒక డ్రింక్ పరిశ్రమగా దీన్ని స్థాపించారు. తయారీకి కావలసిన పంచదార, గ్యాస్, అవసరమైన ఫ్లేవర్స్ యూరప్ నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం విదేశాల నుంచి ముడిసరుకుల దిగుమతులపై ఆంక్షల రావడంతో వివిధ పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. అయితే ఆర్టోస్ ఉత్పత్తి మాత్రం ఆగలేదు. స్థానికంగా దొరికే పండ్ల సాయంతో ఇంతకుముందు దిగుమతి చేసుకున్న ఫ్లేవర్ వచ్చేలా డ్రింక్‌ను తయారు చేశారు. జనం బాగా ఇష్టపడడంతో అమ్మకాలు పెరిగి పరిశ్రమ నిలదొక్కుకుంది. దీనికి మొదట్లో రామచంద్రరాజు డ్రింక్స్ అని పేరు పెట్టారు. తర్వాత ఏఆర్ రాజు టానిక్స్‌గా పేరు మార్చారు. అదే ఇప్పుడు ఆర్టోస్‌గా రూపాంతరం చెందింది. అయితే జనం మాత్రం ఇప్పటికీ దీన్ని రాజుగారి డ్రింక్ అనే అంటారు.
ఇది వ్యాపారం కాదు భావోద్వేగమైన వారసత్వం..
ఆంధ్రప్రదేశ్‌లోని మొదటి సోడా పరిశ్రమగా పేరుపొందిన ఆర్టోస్ 2019 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పరిశ్రమలో భాగస్వామ్యం తీసుకొని దేశ, విదేశాల్లో విస్తరించడానికి వాల్‌మార్ట్ , రిలయన్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఆఫర్ చేసినా సమ్మతించలేదు. రాజుగారి వారసుడు, ఆ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన అడ్డూరి జగన్నాథవర్మ దీన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని వ్యాపారంగా కన్నా భావోద్వేగమైన వారసత్వంగా భావిస్తామని, అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తామే కొనసాగిస్తున్నామని ఆయన చెబుతారు. ప్రస్తుతం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ డ్రింక్ అమ్మకాలు సాగుతున్నాయి. ఈ మూడు జిల్లాల్లో 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇంకా విస్తరించే యోచనలో ఉన్నారు.
వివిధ రుచుల్లో లభ్యం..
ఈ డ్రింక్ ద్రాక్ష, నిమ్మ, ప్రిన్స్, ఆరెంజ్, సోడా రుచుల్లో లభ్యమవుతోంది. 200 మిల్లీలీటర్లు, 250 మిల్లీలీటర్లు 500 మిల్లీలీటర్లు, లీటరు, లీటరున్నర బాటిళ్లలో మార్కెట్లో దొరుకుతోంది. మల్టీనేషనల్ కంపెనీల పోటీకి తట్టుకొని ఈ పరిశ్రమ వందేళ్ల పైబడి నడుస్తుండడం ఒక అద్భుతమనే చెప్పాలి. మార్కెట్‌లో లభ్యమయ్యే ఇతర కూల్ డ్రింక్స్ కన్నా ఆర్టోస్ ధర ఎప్పడూ తక్కువే.
ప్రారంభంలో అర్ధణా (మూడు పైసలు)కు అమ్మిన ఈ డ్రింక్ ధర కాలానుగుణంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 200 మిల్లీలీటర్ల బాటిల్ ధర రూ.పదికి, 1.25 లీటర్ బాటిల్ ధర రూ.50కు అమ్ముతున్నారు. మొదట్లో రాజుగారు ఒక్కరే సమీపంలోని వెల్ల గ్రామం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. 1955 నాటికి 30 మంది ఇందులో పనిచేసేవారు. ప్రస్తుతం 150 మంది పనిచేస్తున్నారు.
తరతరాల ఆదరణ..
తక్కువ ధరకు స్థానికంగా లభ్యమయ్యే ఈ శీతల పానీయాన్ని జనం తరతరాలుగా ఇష్టపడుతున్నారు. ఎటువంటి రసాయన వ్యర్థాలు లేకుండా తయారయ్యే ఈ డ్రింక్ సేవించడం వల్ల ఇతర అనర్థాలు ఉండవని జనం భావించడం వల్ల ఆస్వాదిస్తూ ఆదరిస్తున్నారు.
Also Read : East Godavari Vimal Drink – విమల్ చల్లదనానికి 38 ఏళ్లు