Dharani
Dharani
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న తరుణం ఆసన్నమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. నరేంద్ర మోది సర్కార్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత.. ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారనే ప్రకటన వెలువడి నాటి నుంచి.. దేశ వ్యాప్తంగా అనేక ఊహాగానాలు, చర్చలు జోరందుకున్నాయి. కేంద్ర సర్కార్ సంచలన బిల్లు ఆమోదం కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతుందని అందరూ భావించారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతారని మాత్రం ఎవరు ఊహించలేదు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. కేంద్ర కేబినెట్.. మహిళా బిల్లుకు ఆమోదం తెలపడం సంచలనంగా మారింది.
దేశవ్యాప్తంగా ప్రజలు.. ఎంతో సంతోషంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న వేళ.. ఆ ఆనందాన్ని మరింత పెంచే నిర్ణయం తీసుకుంది మోది సర్కార్. సోమవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరగ్గా.. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు.. విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు.
మోదీ ప్రభుత్వం.. మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్‌ను నేరవేరుస్తుందని తెలిపారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చే ధైర్యం కేవలం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని.. నేటితో ఆ విషయం మరోసారి రుజువైందని తెలిపారు. బిల్లును ఆమోదించిన మోదీ సర్కార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే అనూహ్యంగా కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందితే.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగా పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎన్నో ఏళ్లుగా నానుతూనే ఉంది. సుమారు 27 ఏళ్ల క్రితం అనగా.. 1996 లో అప్పుడు అధికారంలో ఉన్న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ముందుగా ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినా అది లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు.
చివరకి 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజ్యసభ ఆమోదం పొందినప్పటికి.. లోక్‌సభలో మాత్రం పెండింగ్‌లోనే ఉండడంతో అది చట్టంగా మారలేకపోయింది. ఇక 2014 లో లోక్‌సభ రద్దు కావడంతో మహిళ రిజర్వేషన్ల బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. ఈ నిర్ణయం తీసుకోవడం కీలక పరిణామంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఇంకా ఎలాంటి కీలక బిల్లులు తీసుకురానున్నారు అనే దాని మీద ఆసక్తి పెరిగింది.