పిల్లలకు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటివి వస్తే సిరప్లు తాగిస్తుంటారు. పెద్దలకు ఇచ్చినట్లు సూదులు, ట్యాబ్లెట్స్ను ఎక్కువగా ఇవ్వరు. ముఖ్యంగా చిన్నారులకు వైద్యులు సిరప్లు ఇస్తుంటారు. అయితే అధిక లాభాపేక్షతో కొన్ని కంపెనీలు నాసిరకం మందులను తయారు చేస్తున్నాయి. చిన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో కూడా నాసిరకంవి వస్తున్నాయి. అలాంటి ఒక నాసిరకం సిరప్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఇండియాలో తయారై ఇరాక్‌లో అమ్ముడవుతున్న మరో నాసిరకం సిరప్‌పై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది.
పిల్లలకు సాధారణ జలుబు వచ్చినప్పుడు వాడే కోల్డ్ అవుట్ సిరప్ ఎంతమాత్రం సురక్షితం కాదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఈ విషయాన్ని గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన మెడికల్ అలర్ట్‌లో తెలిపింది. ఈ కోల్డ్ అవుట్ సిరప్‌ను చెన్నైకి చెందిన ఫోర్ట్స్ లాబొరేటరీస్ తయారు చేయగా.. దీని వినియోగం ఇరాక్‌లో ఎక్కుగా ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఈ సిరప్ ఎంత మాత్రం సేఫ్ కాదని.. పిల్లలు దీన్ని తాగితే అనారోగ్యానికి గురవుతారని స్పష్టం చేసింది. ఒక్కోసారి ఈ సిరప్ ద్వారా మరణాలు కూడా సంభవించొచ్చని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
కోల్డ్ అవుట్ సిరప్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఇందులో డైథైలీన్ గ్లైకాల్ (0.25 శాతం), ఇథిలీన్ గ్లైకాల్ (2.1 శాతం) కలుషితాలు ఉన్నాయని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఉపయోగించాల్సిన దాని కంటే 0.10 శాతం ఇది అధికంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటిదాకా కోల్డ్ అవుట్ సిరప్‌పై ఇరాక్ అధికారులు ఎలాంటి కంప్లయింట్స్ చేయలేదు. కాగా, గతేడాది ఉజ్బెకిస్థాన్, గాంబియాల్లో పిల్లల మరణాలకు ఇండియాలో తయారు చేసిన దగ్గు మందులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.