Dharani
ఓవైపు ఎండలు మండిపోతుంటే.. ఓ ప్రాంతంలో మాత్రం ఆకస్మిక తుపాను కారణంగా 5గురు చనిపోయారు. ఆ వివరాలు..
ఓవైపు ఎండలు మండిపోతుంటే.. ఓ ప్రాంతంలో మాత్రం ఆకస్మిక తుపాను కారణంగా 5గురు చనిపోయారు. ఆ వివరాలు..
Dharani
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని చెప్పడమే కాక.. కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మన దగ్గర ఏమో ఎండలు మండిపోతుంటే.. ఓ చోట మాత్రం తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా ఐదుగురు మృతి చెందారు. ఆ వివరాలు..
ఇంతకు తుపాను బీభత్సం సృష్టించింది ఎక్కడ అంటే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో. బంగ్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మిక గాలివాన విరుచుకుపడింది. ముఖ్యంగా జల్‌పాయ్‌గురి జిల్లాలో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలులతో పాటు తుఫాను ధాటికి వందలాది నివాసాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆకస్మిక తుఫాను కారణంగా ఐదుగురు మృతిచెందగా, మరో 500 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.
ఇదిలా ఉండగా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన జల్‌పాయ్‌గురికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం అర్థరాత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అధికారులను అడిగి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. జల్‌పాయ్‌గురి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్చించారు. తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, అన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుందని ఈ సందర్భంగా దీదీ వారికి భరోసా ఇచ్చారు. బెంగాల్లో వచ్చిన ఆకస్మిక తుపాను కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో బీజేపీ కార్యకర్తలు పాల్గొనాలని, అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీ ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లో ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా వచ్చిన తుపాను ప్రభావం సుమారు 10 నిమిషాల పాటు కొనసాగిందని..ఇది తీస్తా నది దిగువ నుంచి ప్రారంభమై భారీ శబ్దంగా మారి పలు చెట్లను నేలకూల్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆదివారం జల్‌పాయ్‌గురి పట్టణంలోని చాలా ప్రాంతాలు, పొరుగున ఉన్న మైనగురిలోని అనేక ప్రాంతాలలో వడగళ్లతో కూడిన బలమైన గాలులు వీచాయి. ఇళ్లు కూలిపోయి ఎందరో నిరాశ్రయులయ్యారు.