UP Hathras Bhole Baba Incident Updates: మట్టి కోసం ఎగబడి.. మట్టిలో కలిసిపోయారు.. హత్రాస్‌ తొక్కిసలాటలో 116 మంది మృతి

Bhole Baba Incident: మట్టి కోసం ఎగబడి.. మట్టిలో కలిసిపోయారు.. హత్రాస్‌ తొక్కిసలాటలో 116 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌, హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో సుమారు 116 మంది మృతి చెందారు. ఈ ఘటనకు అసలు కారణం ఏంటి అంటే..

ఉత్తరప్రదేశ్‌, హత్రాస్‌లో భోలే బాబా సత్సంగ్‌ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో సుమారు 116 మంది మృతి చెందారు. ఈ ఘటనకు అసలు కారణం ఏంటి అంటే..

సమాజంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే.. మనం అంతరిక్షంలోకి వెళ్లి ఏం లాభం.. మూఢనమ్మకాలు, దొంగబాబాలను అనుసరించడంలో ఎలాంటి మార్పు లేనప్పుడు అనిపిస్తుంది. వాళ్లను ఏదో మానవతీత శక్తులుగా భావించి.. వారి దగ్గర ఏవో అతీంద్రియ శక్తులు ఉంటాయని నమ్మి.. ఎగబడే జనాలు మన దగ్గర ఇంకా లక్షల్లో ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఘటన చూస్తే.. మన సమాజం మారడానికి ఇంకా ఎన్ని శతబ్దాలు పడుతుందో తెలియదు అనిపించక మానదు. బాబా తొక్కిన మట్టి కోసం ఎగబడి.. వందకు పైగా ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. ఈ విషాదకర ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. వందల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటన వివరాలు..

ఈ విషాదకర సంఘటన హత్రాస్‌లోని ఫుల్‌రయీ గ్రామంలో నిర్వహించిన సత్సంగ్‌లో చోటు చేసుకుంది. భోలే బాబా పాద ధూళి కోసం ఎగబడ్డ భక్తులు.. చివరకు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఇంతకు ఎవరీ బాబా.. ఆయనపై జనాలకు ఎందుకు అంత నమ్మకం.. అసలేం జరిగింది అంటే.. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన సూరజ్‌ పాల్‌ అలియాస్‌ సకార్‌ విశ్వ హరి భోలే బాబాగా ప్రసిద్ధి చెందాడు. తనను తాను దైవాంశసంభూతుడిగా చెప్పుకుంటాడు. ఇక ఈ భోలే బాబా గతంలో పోలీస్‌ ఆఫీసర్‌ కావడం గమనార్హం.

ఉత్తర్ ప్రదేశ్‌లోని కిషన్‌గంజ్‌ జిల్లాకు చెందిన భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్.. గతంలో పోలీసు ఇంటెలిజెన్స్ విభాగంలో 18 ఏళ్లపాటు పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తాడు. తనను తాను దైవాంశసంభూతుడిగా ప్రచారం చేసుకునేవాడు. కొద్ది కాలంలోనే జనాలు ఇతడిని విశ్వసించడం మొదలు పెట్టారు. ఈక్రమంలో ఇతడిని విశ్వసించే వారు ‘నారాయణ సాకార్‌ హరి’.. ‘సాకార్‌ విశ్వ హరి బాబా’ అనే పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో నిర్వహించే సమావేశాలకు వేలాదిగా భక్తులు హాజరవుతుంటారు. యూపీతో పాటు పొరుగున ఉన్న హరియాణా, రాజస్తాన్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తుంటారు. భోలేబాబకు ఎంత క్రేజ్‌ ఉందంటే.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఈ సత్సంగాలకు రావడం గమనార్హం.

ఈ క్రమంలో నిన్న అనగా మంగళవారం నాడు సత్సంగ్ నిర్వహించారు. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకున్నా.. భక్తుల రాకకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు. 5 వేల మంది పట్టే స్థలంలో 20 వేల మందితో సత్సంగ్ నిర్వహించడమే ఈ దుర్ఘటనకు కారణమైంది. అంతేకాదు, వేదిక ముందు కూర్చున్నవారు వేడి, ఉక్కుబోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సత్సంగ్ ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సత్సంగ్‌ ముగిసిన తర్వాత భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాటకు దారితీసింది అంటున్నారు.

ఈ తొక్కిసలాట కారణంగా వందల మంది ఊపిరాడక విలవిలాడిపోయారు. చనిపోయిన వారిలో 108 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఇక ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. విచారణకు ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలికి చాలా మంది పోలీస్ ఉన్నతాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్యాడ్‌‌లు చేరుకోగా.. బాబా ఆశ్రమానికి చేరుకుని విచారిస్తున్నారు.

Show comments