UP Reena Dwivedi Personal Life Struggles: ఈ ఎన్నికల ఆఫీసర్‌ని గుర్తు పట్టారా.. అందమైన రూపం వెనక ఎంతో విషాదం

ఈ ఎన్నికల ఆఫీసర్‌ని గుర్తు పట్టారా.. అందమైన రూపం వెనక ఎంతో విషాదం

Reena Dwivedi: 2019 ఎన్నికల వేళ చేతిలో పోలింగ్‌ సామగ్రి పట్టుకుని.. వెళ్తున్న అందమైన అధికారిణి ఫొటో ఒకటి గతంలో తెగ వైరల్‌ అయింది గుర్తుంది కదా. ఆమె గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Reena Dwivedi: 2019 ఎన్నికల వేళ చేతిలో పోలింగ్‌ సామగ్రి పట్టుకుని.. వెళ్తున్న అందమైన అధికారిణి ఫొటో ఒకటి గతంలో తెగ వైరల్‌ అయింది గుర్తుంది కదా. ఆమె గురించి ప్రత్యేక కథనం మీకోసం..

ఎలక్షన్‌ పోలింగ్‌, ఎన్నికల సిబ్బంది అనగానే సోషల్‌ మీడియాలో, జనాల మదిలో ఓ అధికారిణి ఫోటో గిర్రున తిరుగుతుంటుంది. అందమైన డ్రెస్సింగ్‌, ఆకర్షణీయమైన రూపంలో.. చేతిలో పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్తున్న ఆ అధికారిణియే కళ్ల ముందు కనిపిస్తుంది. 2019 సార్వత్రి ఎలక్షన్‌, 2022 అసెంబ్లీ ఎన్నికల వేళ సదరు అధికారిణి ఫోటో నెట్టింట తెగ హల్చల్‌ చేసింది. ఆమెకు ఎందరో అభిమానులు ఏర్పడ్డారు. హీరోయిన్ల కన్నా.. ఈ ఉద్యోగినే చాలా అందంగా ఉంది అని కామెంట్స్‌ చేశారు. అఫ్‌కోర్స్‌ కొందరు దరిద్రులు ఆమె మీద చండాలమైన విమర్శలు కూడా చేశారు. నేటికి కూడా మన సమాజంలో మహిళ ధరించే వస్త్రాలను బట్టి.. ఆమె క్యారెక్టర్‌ని అంచనా వేసి కామెంట్స్‌ చేస్తుంటారు. ఎవరైనా మహిళా ఏమాత్రం మోడ్రన్‌గా ఉన్నా సరే.. ఇక ఆమెను బరి తెగించిన మహిళగా భావిస్తారు.

సదరు అధికారిణి గురించి కూడా అలాంటి కారు కూతలే కూశారు కొందరు. కానీ ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక తాజాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమె గురించి మరోసారి చర్చ సాగుతోంది. ఈసారి సదరు ఉద్యోగిణి ఎక్కడా కనిపించలేదు. దాంతో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సదరు ఆఫీసర్‌కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఇక సదరు ఆఫీసర్‌ పేరు రీనా ద్వివేది. ఫోటో చూస్తే చాలు ఆమెని టక్కును గుర్తుపడతారు జనాలు. ఆమె స్వస్థలం యూపీలోని గోరఖ్‌పూర్ ప్రాంతంలోని డియోరియా. చూడ్డానికి ఎంతో అందంగా, ఫ్యాషనబుల్‌గా కనిపించే ఆమె ఆహార్యం వెనక ఎంతో విషాదం దాగుంది. దీని గురించి ఆమె గతంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా రీనా ద్వివేది మాట్లాడుతూ.. ‘‘మాది యూపీలోని మధ్యతరగతి కుటుంబం. గోరఖ్‌పూర్‌లోనే చదువుకున్నాను, నాన్న పోలీస్ శాఖలో పని చేస్తుంటారు. అమ్మ గృహిణి. నాకు ఇద్దరు అక్కలు, అన్నలు. నేనే చిన్నదాన్ని. దాంతో అందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసేవారు. కాలేజీ పూర్తయ్యాక మారుతి సుజుకిలో బీమా మేనేజర్‌గా కూడా చేశాను’’ అని చెప్పుకొచ్చింది.

ఒక్కసారిగా విషాదం..

‘‘2004లో నాకు పెళ్లయింది. భర్త పేరు సంజయ్ ద్వివేది. వివాహం తర్వాత నా జీవితం ఎంతో సంతోషంగా సాగింది. మరి నా అదృష్టాన్ని చూసి విధికి కన్ను కుట్టుంది ఏమో.. 2013లో నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటికి నాకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఎంతో ప్రేమించే భర్త దూరమవ్వడంతో.. రెండేళ్లు డిప్రెషన్‌లోనే ఉండిపోయాను. గది దాటి బయటికి వచ్చేదాన్ని కాదు. కానీ నా కుటుంబం ఇచ్చిన మద్దతుతో ధైర్యం కూడగట్టుకున్నాను. దాంతో పాటు యోగా కూడా నన్ను మళ్లీ మాములు మనిషిని చేసింది. నా భర్త మరణించడంతో అదే పబ్లిక్ వర్క్స్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కారుణ్య నియామకం కింద కొలువు ఇచ్చారు. ఇప్పుడు నేను సీనియర్‌ అసిస్టెంట్‌ను’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది రీనా.

‘‘జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ ధైర్యంగా ముందుకు సాగాను. నాకు అందంగా డ్రెస్‌ చేసుకోవడం, ఫిజిక్, ఆరోగ్యం కాపాడుకోవడం ఇష్టం. అవే నాలో ఆత్మవిశ్వాసం పెంచాయి. నేను ఎప్పుడు ఇలానే రెడీ అవుతాను. ఇలా ఉండగానే.. 2019 ఎన్నికల వేళ విధులు నిర్వహిస్తోన్న నా ఫొటో ఒకటి వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత 2022లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్యాంటు, నలుపు షర్టులో కనిపించాను. మళ్లీ ఫోటోలు వైరల్. దాంతో నాకు టీవీ సీరియళ్లు, భోజ్‌పురి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ నేను నో చెప్పాను. నా కొడుకును చూసుకోవాలి. వాడే నా ప్రపంచం. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నాకిది చాలు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘ఏడుస్తూ బతకడం నాకిష్టం ఉండదు. పొద్దున్నే లేచి యోగా చేస్తాను, తరువాత పూజ, ఆ తరువాత ఆఫీసు. తిరిగి వచ్చాక వీడియోలు చేస్తాను, పోస్ట్ చేస్తాను, నా కొడుకు బాగోగులు చూసుకుంటాను. ఇన్‌స్టా క్వీన్ అనీ, లేడీ సింగం అనీ పేర్లు పెట్టారు. నేను వాటిని పట్టించుకోను. బిగ్‌బాస్ ఆఫర్‌ వచ్చినా.. వద్దనుకున్నాను. నాకు నచ్చినట్లు ఉంటూ ఎంతో సంతోషంగా ఉన్నాను. నా స్నేహితురాళ్లకు ఇదే చెప్తాను. జీవితం అంటే సమస్యలు, కన్నీళ్లే కాదు. వాటిని దాటుకుని ధైర్యంగా ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి అంటాను’’అని చెప్పుకొచ్చింది రీనా ద్వివేది.

Show comments