రైలు ప్రయాణం రానురాను ప్రియంగా మారుతోంది. పెరుగుతున్న టికెట్ ధరలు ట్రైన్ ప్యాసింజర్స్‌ను భయపెడుతున్నాయి. చాలా రైళ్లలో స్లీపర్ క్లాసుల బోగీలను కుదించి.. ఏసీ క్లాస్ బోగీలను పెంచుతున్నారు. ఏసీ క్లాసులో ప్రయాణించాలంటే ధరలు ఏ రేంజ్లో ఉంటాయో తెలిసిందే. దీంతో రైళ్లలో ప్రయాణించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ తరుణంలో ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ ఛైర్కార్తో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీల టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు కలిగిన రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది. వందేభారత్‌తో పాటు అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లు కలిగిన అన్ని ట్రైన్స్కూ ఇది వర్తిస్తుంది.
రైళ్లలో ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ట్రైన్స్‌లో ఆక్యుపెన్సీని పెంచాలనే ఉద్దేశంతోనే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై టికెట్ రేట్లను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు కట్టబెట్టింది. ఇక, దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు విరివిగా అందుబాటులోకి వస్తున్న విషయం విదితమే. అయితే ఈ రైళ్లకు కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ.. మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. ఎండలు తగ్గి వర్షాలు పడుతుండటంతో ఏసీ బోగీల్లో.. ముఖ్యంగా ఛైర్ కార్ల్‌లో ప్రయాణానికి ఆశించిన మేర ప్యాసింజర్ల నుంచి డిమాండ్ ఉండట్లేదని సమాచారం.
ఆక్యుపెన్సీ తగ్గడంతో పాటు ఏసీ బోగీలకు ప్రయాణికుల నుంచి అంతగా డిమాండ్ రాకపోవడంతో రైల్వే బోర్డు ఈ కొత్త స్కీమ్‌తో ముందుకొచ్చింది. బేసిక్ ఫేర్‌లో గరిష్ఠంగా 25 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. దీనికి రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జి, జీఎస్టీ లాంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణనలోకి తీసుకొని ఆయా ట్రైన్స్, రూట్స్‌లో ఈ డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటిస్తారు. ఈ డిస్కౌంట్ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది. అయితే ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. అలాగే హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్‌కు ఈ స్కీమ్ వర్తించదని పేర్కొంది. ఇక, ఇండియన్ రైల్వేస్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ బోగీల్లో ప్రయాణించే సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని చెప్పొచ్చు.
.@RailMinIndia introduces Discount Scheme in AC Chair Car and Executive Classes of all trains having AC Sitting Accommodation including Anubhuti & Vistadome Coaches
The element of discount shall be upto maximum 25% on the basic fare
Read here: https://t.co/WrI24I2Crt
— PIB India (@PIB_India) July 8, 2023