iDreamPost
android-app
ios-app

తండ్రీకొడుకులను బలిగొన్న NEET.. గవర్నర్ కు స్టాలిన్ చురకలు!

తండ్రీకొడుకులను బలిగొన్న NEET.. గవర్నర్ కు స్టాలిన్ చురకలు!

భారతదేశంలో ఎవరైనా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలి అంటే తప్పకుండా NEET పరీక్షను క్లియర్ చేయడం తప్పనిసరి. అయితే అంత తేలిక కాదని అందరికీ తెలుసు. ఈ పరీక్షను క్లియర్ చేయలేక ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే తమిళనాడు నుంచి మరో నీటి మరణం నమోదు అయింది. అంతేకాకుండా ఎదిగొచ్చిన కొడుకు బలవన్మరణానికి పాల్పడటంతో తట్టుకోలేని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గవర్నర్ ఆర్ఎన్ రవికి చురకలు అంటించారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు విద్యార్థులకు ముఖ్య సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీట్ పరీక్ష రద్దు అయి తీరుతుందని హామీ ఇచ్చారు. ఈలోపు ఎవరూ కూడా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు. నీట్ పరీక్ష రద్దు కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయపరంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్టాలిన్ ప్రకటించారు. నీట్ పరీక్షను క్లియర్ చేయలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది. జ్యూడీషియల్ కమిటీ ద్వారా ప్రయత్నాలు కూడా చేశారు. అసెంబ్లీ ద్వారా యాంటీ నీట్ బిల్లుని తీసుకురాగా.. అందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి మాత్రం ఆమోదం తెలపలేదు.

నీట్ పరీక్ష జరగాల్సిందే అంటూ ఆయన పట్టుబట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే స్టాలిన్ మాత్రం మరికొన్ని నెలల్లోనైనా నీట్ హద్దులు బద్దలు కావాల్సిందే అంటూ బలంగా చెబుతున్నారు. ఇదే క్రమంలో సీఎం స్టాలిన్ గవర్నర్ ఆర్ఎన్ రవికి కూడా చురకలు అంటించారు. ఎవరైతే సతకం పెట్టనని చెబుతున్నారో.. రాజకీయంగా మార్పులు జరిగితే వాళ్లే కనిపించకుండా పోతారని సీఎం వ్యాఖ్యానించారు. అప్పుడు నీట్ రద్దుకు అన్ని మార్గాలు సులభతరం అవుతాయన్నారు. అలాగే ఆగస్టు 15 సందర్భంగా గవర్నర్ నిర్వహించే తేనీటి విందును తమిళనాడు ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు.

యాంటీ నీట్ బిల్లు విషయంలో జాప్యం చేయడం, నీట్ జరిగి తీరాల్సిందేనంటూ పట్టుబట్టడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఎవరంటే.. చెన్నైకి చెందిన జగదీశ్వరన్(19). ఇతను రెండుసార్లు నీట్ పరీక్ష రాశాడు. కానీ, రెండుసార్లు ఆ పరీక్షలో విజయం సాధించలేకపోవడంతో.. మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కన్నకొడుకు మరణాన్ని జీర్ణించుకోలేనే తండ్రి సెల్వశేఖర్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ల మరణాలపై సీఎం స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా.. ఇవే ఆఖరి నీట్ మరణాలు కావాలని ఆకాంక్షించారు.