Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ముస్లిం మహిళలకు కూడా భరణం

Supreme Court-Muslim Women, Maintenance: ముస్లిం మహిళలకు సంబంధించిన సుప్రీంకోర్టు.. చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

Supreme Court-Muslim Women, Maintenance: ముస్లిం మహిళలకు సంబంధించిన సుప్రీంకోర్టు.. చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఆ వివరాలు..

భారతదేశం అంటేనే భిన్న మతాలు, కులాలు, ఆచారవ్యవహరాలు ఆచరించే వారితో కలిసి కట్టుగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వం చూపే దేశంగా ప్రసిద్ధి చెందింది. మన దేశంలో తమ మతం, ఆచార వ్యవహరాలను పాటిస్తూనే.. ఇతర మతాలకు చెందిన సాంప్రదాయలు, పద్దతులను గౌరవించే తీరు ఎన్నో ఏళ్లుగా అమల్లో ఉంది. ఇక చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కూడా ఆయా మతాలు, సాంప్రదాయలకు అనుకూలంగా ఉంటాయి. వాటిని గౌరవిస్తూనే అసమానతలు రూపు మాపే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రిపుల్‌ తలాక్‌, యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌, క్రిమినల్‌ చట్టాలు వంటి అంశాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వార్తల్లో నిలవగా.. తాజాగా మరో చరిత్రాత్మక తీర్పు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు.. బుధవారం నాడు చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. విడాకులు తీసుకునే ముస్లిం మహిళల భరణంపై సంచలన తీర్పు వెల్లడించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భర్త నుంచి భరణం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 125 ఇందుకు అవకాశం కల్పిస్తోందని.. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణం తీసుకునేందుకు అర్హులే అంటూ.. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అగస్టైన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. పైగా హైదరాబాద్‌ దంపతుల కేసులోనే ఈ తీర్పు రావడం గమనార్హం.

కేసేంటంటే..

కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి.. కొన్నాళ్ల క్రితం తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే వారికి విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం.. ఆమెకు భరణం చెల్లించాలని మహ్మద్‌ అబ్దుల్‌ని ఆదేశించింది. అందుకు నిరాకరించిన అబ్దుల్‌.. తెలంగాణ హైకోర్టులో దీన్ని సవాల్‌ చేయగా.. ఈ తీర్పులో జోక్యం చేసుకోడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు.

ఈ పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం.. దిగువ కోర్టు వెల్లడించిన తీర్పును సమర్దించింది. మతాలతో సంబంధం లేకుండా విడాకులు తీసుకున్న ప్రతి మహిళకు భరణం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు, భరణం అనేది విరాళం కాదని, అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 125 వివాహిత మహిళలకే కాకుండా ప్రతి ఒక్క మహిళకు వర్తిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ సదర్భంగా ధర్మాసనం.. ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘కొంతమంది భర్తలకు.. ఇంటిపట్టున ఉండే భార్య తమపైనే ఆధారపడి ఉంటుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండడం లేదు. ఆర్థికంగానే కాక.. భావోద్వేగపరంగా కూడా అలాంటి మహిళలు భర్తపైనే ఆధారపడి ఉంటారు.. ఇప్పటికైనా గృహిణుల విలువను అర్థం చేసుకోవాలి. కుటుంబం కోసం, బంధం కోసం వాళ్లు చేసే త్యాగాలను పురుషులు గుర్తించాలి’’ అంటూ ధర్మాసనం చీవాట్లు పెట్టింది. తగిన ఆదాయ మార్గాలు కలిగి ఉన్న వ్యక్తి.. తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు ఇచ్చే భరణాన్ని తిరస్కరించలేరని సెక్షన్ 125 స్పష్టం చేస్తుంది. ఇక ఈ తీర్పుపై ముస్లిం మహిళలు మర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments