విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆ టీచర్లు తల్లిదండ్రుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తేనో, సరిగా చదవకపోతేనో ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఈ పనిష్మెంట్ హద్దు మీరినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ తరహాలోనే ఓ టీచర్ విద్యార్థికి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఆ విద్యార్థి తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. అంత కఠినమైన పనిష్మెంట్ ఇస్తావా అంటూ దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కాన్పూర్ లోని ఓ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థికి కఠినమైన పనిష్మెంట్ ఇచ్చాడు. ఏ మాత్రం కనికరం లేకుండా ఆ బాలుడితో ఏకంగా 50 గుంజీలు తీయించాడు. దీంతో ఆ విద్యార్థి కాలు వాచిపోయింది. ఇక స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన విద్యార్థి నొప్పితో బాధపడుతుండడంతో పేరెంట్స్ ఆరా తీశారు. వెంటనే ఆ విద్యార్థి టీచర్ గుంజీలు తీయించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన విద్యార్ధి తండ్రి స్కూల్ కు వెళ్లాడు. అప్పటికే ప్రిన్సిపాల్ ఆఫీస్ లో ఉన్న ఉపాధ్యాయుడిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు.

అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. చిన్న పిల్లాడు అని చూడకుండా అంత కఠినంగా శిక్షిస్తావా అంటూ ఎడాపెడా వాయించాడు. ఈ హఠాత్పరిణామంతో స్కూల్ యాజమాన్యం షాక్ కు గురైంది. వెంటనే తేరుకున్న స్కూల్ సిబ్బంది విద్యార్థి తండ్రికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత స్కూల్ యాజమన్యం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి తండ్రి టీచర్ పై దాడికి పాల్పడుతుండగా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

Show comments