iDreamPost

టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా

  • By singhj Published - 07:07 PM, Thu - 21 September 23
టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా

క్రికెట్​కు ఎందరో గొప్ప ఆటగాళ్లను అందించింది భారత్. బ్యాట్స్​మెన్​కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇండియా నుంచి ఎందరో అద్భుతమైన ప్లేయర్లు 22 గజాల పిచ్​పై తమ బ్యాట్లతో అద్భుతాలు చేశారు. అసమాన ప్రతిభతో క్రికెట్​ను ఏలిన భారత బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకడిగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని చెప్పొచ్చు. టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఇలా ఫార్మాట్ ఏదైనా భారీగా పరుగులు చేస్తూ, సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ప్రస్తుత క్రికెట్​లో బెస్ట్ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్నాడు విరాట్. అయితే మరికొన్ని రోజుల్లో 35వ పడిలోకి అతడు అడుగుపెడతాడు. మంచి ఫిట్​నెస్​తో ఉన్న కోహ్లీ మరికొన్నేళ్లు క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అతడి వారసుడు ఎవరనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

విరాట్ కోహ్లీ వారసుడు ఎవరనే దానికి భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఒక పేరును సూచించాడు. టీమిండియాలో విరాట్​కు సరైన వారసుడు శుబ్​మన్ గిల్ అని రైనా అన్నాడు. ఈ మధ్య కాలంలో భారత జట్టులో అత్యంత విజయవంతమైన క్రికెటర్​గా గిల్ పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్​గా ముగిసిన ఆసియా కప్​లోనూ 75.50 సగటుతో 302 రన్స్ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ దుమ్మురేపుతున్న ఈ యంగ్ క్రికెటర్ గురించి రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ కూడా తదుపరి కోహ్లీ కావాలని అనుకుంటున్నాడని అన్నాడు. రాబోయే ప్రపంచ కప్​లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో శుబ్​మన్ కూడా ఉంటాడని పేర్కొన్నాడు.

‘ఏడాదిన్నరగా శుబ్​మన్ గిల్ నిలకడగా ఆడుతున్నాడు. ఒక్క వెస్టిండీస్​ టూర్​లోనే కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ, ఆసియా కప్​తో తిరిగి ఫామ్​ను అందుకున్నాడు. పాజిటివ్​గా కనిపిస్తున్న గిల్ ఫుట్​వర్క్ కూడా బాగుంది. ఈజీగా 50, 100 రన్స్ చేస్తున్నాడు. వరల్డ్ కప్​లో ఇంపార్టెంట్ ప్లేయర్లలో అతనొకడు. తాను స్టార్ ఆటగాడిగా ఎదగాలని, నెక్స్ట్ విరాట్ కోహ్లీ కావాలని గిల్ కూడా అనుకుంటున్నాడని నాకు తెలుసు. వరల్డ్ కప్ తర్వాత మనం తరచూ అతడి గురించే మాట్లాడుకుంటాం. గిల్ హ్యాండ్ పవర్ బాగుంది. అతడికి ఎక్కడ బౌలింగ్ చేయాలో స్పిన్నర్లకు తెలియదు. పేసర్లు స్వింగ్ చేయకపోతే నేరుగా లేదా ఫ్లిక్​తో వాటిని బాగా ఆడగలడు. 2019 వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ ఎలా ఆడాడో.. ఈ ప్రపంచ కప్​లో గిల్ కూడా అలాగే రాణిస్తాడు. ఓపెనర్ కాబట్టి 50 ఓవర్లు ఆడే ఛాన్స్ ఉండటం అతడికి ఉన్న అడ్వాంటేజ్’ అని రైనా చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: సూర్యపై మాకు నమ్మకం ఉంది: ద్రవిడ్